Usha Chilukuri | మా ఆయన మాంసం, ఆలుగడ్డ కూర బాగా వండుతారు.. ఉషా చిలుకూరి..!
Usha Chilukuri | ఉషా చిలుకూరి..! ఈమె తెలుగు మూలాలున్న ఇండో అమెరికన్ మహిళ. ఈ మధ్య గత కొన్ని రోజులుగా ఈమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఎందుకంటే ఆమె భర్త జేడీ వాన్స్ రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష రేసులో ఉన్నారు.

Usha Chilukuri : ఉషా చిలుకూరి..! ఈమె తెలుగు మూలాలున్న ఇండో అమెరికన్ మహిళ. ఈ మధ్య గత కొన్ని రోజులుగా ఈమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఎందుకంటే ఆమె భర్త జేడీ వాన్స్ రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష రేసులో ఉన్నారు. ఇండో అమెరికన్ మహిళ భర్త అమెరికా ఉపాధ్యక్ష రేసులో ఉండటంతో భారత మీడియా వీరి గురించి ఆసక్తికర కథనాలు ప్రచురిస్తోంది. వాన్స్ తెలుగు మూలాలున్న మహిళ భర్త కావడంతో తెలుగు మీడియాలో కూడా మరింత ఆసక్తికరమైన కథనాలు ప్రచురితమవుతున్నాయి. అందుకే జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉష ఇప్పుడు ఇప్పుడు వార్తల్లో వ్యక్తులుగా మారారు.
తాజాగా గురువారం మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు, అమెరికా పౌరులకు ఉషా చిలుకూరి తన భర్త జేడీ వాన్స్‌ను లాంఛనంగా పరిచయం చేశారు. ఆయన భారతీయ వంటకాలను వండగలరని చెప్పారు. ముఖ్యంగా మాంసం, ఆలుగడ్డ కూరను ఆయన అద్భుతంగా వండుతారని తెలిపారు. తాము ముందుగా స్నేహితులమని, తర్వాత దంపతులుగా మారామని, వాన్స్ చాలా ఆసక్తికరమైన వ్యక్తి అని ఆమె వెల్లడించారు.
తన భర్త జేడీ వాన్స్ అమెరికాకు గొప్ప ఉపాధ్యక్షుడు అవుతారని ఉషా చిలుకూరి చెప్పారు. ఆయన చిన్నప్పటి కష్టాలను అధిగమించి జీవితంలో పైకి ఎదిగారని తెలిపారు. ఆయన తన శాకాహార అలవాట్లను ఆమోదించారని, అంతేకాకుండా తన తల్లి నుంచి కొన్ని భారతీయ వంటకాలను నేర్చుకున్నారని వెల్లడించారు. ఆయన తాము స్నేహితులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారని కొనియాడారు.
జేడీ వాన్స్ తీరిక వేళల్లో కుక్కపిల్లలతో కాలక్షేపం చేస్తారని చెబుతూ ఉషా మురిసిపోయారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత, ఆధ్యాత్మిక జీవితంపై ఉషా ప్రభావం చాలా ఉందని చెప్పారు. తన అందమైన అర్ధాంగిని తానెంతో ప్రేమిస్తానని వాన్స్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఉషా అపూర్వమైన న్యాయవాది, ఉత్తమమైన మాతృమూర్తి అని కొనియాడారు. తన అత్తమామల మాదిరిగానే దక్షిణాసియా నుంచి వలస వచ్చిన వారంతా అమెరికాను సుసంపన్నం చేశారని ప్రశంసించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు రాజకీయాలు అవసరం లేదని, కానీ రాజకీయాలకు మాత్రం ఆయన అవసరమని వాన్స్ చెప్పారు. కాగా ఉపాధ్యక్షునిగా పోటీ చేయమని ట్రంప్ కోరిన వెంటనే వాన్స్ లాంఛనంగా ఆమోదం తెలిపారు. 39 ఏళ్ల వాన్స్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే అతిపిన్న వయసులో అమెరికా ఉపాధ్యక్షుడైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి తేలేవరకు ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ముఖాముఖి చర్చ ఉండదని ట్రంప్ శిబిరం పేర్కొంది. వాన్స్‌ను అభ్యర్థిగా రిపబ్లికన్లు ప్రకటించగానే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చర్చకు పిలుపునిచ్చారు.