Trump Tariffs | పుస్తకాల్లోని కల్పిత పాత్ర మాటలే ట్రంప్ టారిఫ్ నిర్ణయానికి ఆధారమా?
ఎవరి సలహాతో ట్రంప్ ఈ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారన్న విషయంలో తెగ చర్చ జరుగుతన్నది. ఆయన దొరికితే పట్టుకుని ఉతికి ఆరేయాలన్న కోపంతో కొందరు ఉన్నారు. ఇంతకీ ట్రంప్‌కు ఈ సలహా ఇచ్చింది ఏదో ప్రముఖ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతుడైన ప్రొఫెసరో లేక ఆర్థిక వ్యవహారాల నిపుణుడో అయి ఉంటారని భావించినట్టయితే.. పప్పులో కాలేసినట్టే! ఎందుకంటారా? ఈ కథ మొత్తం చదవండి..

Trump Tariffs | ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్‌ల విధానంపై ప్రపంచ దేశాలు గుస్సాతో ఉన్నాయి. చైనాతో అమెరికాకు వాణిజ్యం యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. తనపై 104 శాతం టారిఫ్‌లు విధించిన అమెరికాకు షాక్ ఇచ్చేలా ఇప్పటికే విధించిన 34 శాతం టారిఫ్‌లను ఏకంగా 84 శాతానికి చైనా పెంచేసింది. ఈ టారిఫ్‌లతోపాటు.. యూఎస్ ఎయిడ్‌ను మూసేయడం, స్టాఫ్‌ను తగ్గించడం వంటివాటిపై సొంత పార్టీ లామేకర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి సలహాతో ట్రంప్ ఈ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారన్న విషయంలో తెగ చర్చ జరుగుతన్నది. ఆయన దొరికితే పట్టుకుని ఉతికి ఆరేయాలన్న కోపంతో కొందరు ఉన్నారు. ఇంతకీ ట్రంప్‌కు ఈ సలహా ఇచ్చింది ఏదో ప్రముఖ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతుడైన ప్రొఫెసరో లేక ఆర్థిక వ్యవహారాల నిపుణుడో అయి ఉంటారని భావించినట్టయితే.. పప్పులో కాలేసినట్టే! ఎందుకంటారా? ఈ కథ మొత్తం చదవండి..
ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. అందులో మొదటి వ్యక్తి ట్రంప్ అల్లుడు అయితే.. రెండో కీలక వ్యక్తి ఒక రచయిత. దీని వెనుక సాగిన తతంగాన్ని ఎంఎన్‌బీసీ తాజా షోలో హోస్ట్ రేచల్ మాడో బయటపెట్టారు. తొలిసారి అధ్యక్షుడిగా పోటీ చేసిన సమయంలో పీటర్ నవారో అనే వ్యక్తిని ఆర్థిక అడ్వైజర్‌గా ట్రంప్ నియమించుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనే ఆర్థిక సలహాదారుగా కొనసాగుతున్నాడు. ఆయన సలహా ఆధారంగా తాజా టారిఫ్‌లు, విధానపరమైన నిర్ణయాలు వచ్చాయి. నవారో నియామకానికీ ఒక ఆసక్తికర సందర్భం ఉన్నది. ఈ మొత్తంలో అసలు కథ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ చూసిన పుస్తకంతో మొదలైంది. తనకు ఒక ఆర్థిక సలహాదారుడిని చూసి పెట్టాలని అల్లుడిని ట్రంప్ కోరారట. ఆయన ఒక సందర్భంలో అమెజాన్‌లో ‘డెత్ బై చైనా’ అనే పుస్తకాన్ని చూశాడు. ఆ పుస్తకం అతనికి బాగా నచ్చేయడమే కాదు.. ఉంటే గింటే ఈయనే తన మామకు ఆర్థిక సలహాదారుగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేశాడు. పీటర్ నవారో అనే ఆ పుస్తక రచయిత ట్రంప్ ఆర్థిక సలహాదారుగా నియమితులైపోయాడు. ట్రంప్ ఒక విడత పాలన పూర్తి చేశాడు. రెండో దఫా ఓడిపోయాడు. మూడోసారి మళ్లీ విజయం సాధించి అమెరికాకు రెండోసారి అధ్యక్షుడయ్యాడు.
ఇప్పుడు అదే నవారో ఆర్థిక సలహాదారుగా ఉన్నాడు. ఈ నవారో.. రాన్ వారా అనే ఎక్స్‌పర్ట్ ఎకానమిస్ట్ భావనల ఆధారంగా టారిఫ్‌ల సలహా ఇచ్చాడు. అయితే ఈ రాన్ వారా అనే వ్యక్తి ఎవరు? ఈయన ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్? ఏ ప్రఖ్యాత ఆర్థిక సంస్థలను లీడ్ చేశాడు? ఎంత గొప్ప పురస్కారాలు అందుకున్నాడు? ఇవేవీ ఎవరికీ తెలియదు. ఎందుకంటే.. ఈ సలహా ఇచ్చిన రాన్ వారా అనే వ్యక్తి ఈ భూప్రపంచంలో బతికే లేడు. ఆ మాటకొస్తే ఆయన పుట్టలేదు కూడా! మరి ఏం జరిగింది? భూమి మీద లేని వ్యక్తి నుంచి ట్రంప్‌కు ఎలా ఈ టారిఫ్‌ల సలహా అందింది? ఎలాగంటే… రాన్ వారా అనే ఆర్థిక వేత్త ఎవరో కాదు..నవారో రాసిన ఐదు పుస్తకాల్లో సృష్టించిన కల్పిత ఆర్థిక వేత్త క్యారెక్టర్! ఆ పుస్తకాల్లో రాన్ వారా ప్రస్తావించిన సలహాలనే ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్నారన్నమాట! అంటే.. ఒక కల్పిత పాత్రతో కొన్ని పుస్తకాల్లో చెప్పించిన సలహాలను యాజ్ ఇటీజ్‌గా ట్రంప్ పాటిస్తున్నారన్న విషయం తెలిసిన వారు అవాక్కవుతున్నారు.
ఇదిలా ఉంటే.. ట్రంప్ మరో సలహాదారుడైన ఎలాన్ మస్క్.. నవారోను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక దశలో నవారోను ఇటుకల బస్తా అంతటి మొద్దుబారిన మనిషిగా అభివర్ణించారు. భారీ స్థాయిలో టారిఫ్‌లను విధించడాన్ని మస్క్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. యూరప్, అమెరికా మధ్య జీరో టారిఫ్ కోసం చేస్తున్న ప్రయత్నాలను నవారో తీవ్రంగా విమర్శించారు. మస్క్‌ను కారు అసెంబ్లర్‌గా అభివర్ణించారు. ఇంపోర్టెడ్ పార్ట్స్ కోసం ఆధారపడుతున్నాడని విమర్శించారు. విడి భాగాలు అమెరికాలోనే తయారు కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. దీనిపై మస్క్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నవారో నిజంగా మందబుద్ధి కలిగిన వ్యక్తి. ఆయన చెబుతున్నవి పచ్చి అబద్ధాలు..’ అని మస్క్.. ఎక్స్‌లో విమర్శించారు. టెస్లా కార్లు అధికభాగం అమెరికాలోనే తయారవుతాయి.. నవారో.. ఇటుక బస్తాను మించి మొద్దుబారిపోయాడు.. అంటూ మండిపడ్డారు.