ఆ రెస్టారెంట్‌లో వైన్‌ ఫ్రీ.. కానీ.. చాలా సింపుల్‌ షరతుతో!

ఫ్రీ అంటే జనాలు ఎగబడిపోతారు. ఫ్రీ అనే పదానికి ఉన్న శక్తి అటువంటిది. అదే ఒక వైన్‌ బాటిల్‌ ఉచితంగా ఇస్తామొటే! ఒక రెస్టారెంట్‌ ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తమ రెస్టారెంట్‌లో వైన్‌ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.

  • Publish Date - May 14, 2024 / 06:35 PM IST

వెరోనా: ఫ్రీ అంటే జనాలు ఎగబడిపోతారు. ఫ్రీ అనే పదానికి ఉన్న శక్తి అటువంటిది. అదే ఒక వైన్‌ బాటిల్‌ ఉచితంగా ఇస్తామొటే! ఒక రెస్టారెంట్‌ ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తమ రెస్టారెంట్‌లో వైన్‌ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అయితే దానికి ఒక షరతు పెట్టింది. అదేమీ అత్యంత క్లిష్టమైన షరతు కూడా కాదు! కానీ.. ఒక విధంగా చూస్తే.. కష్టమైనదే! ఆ కథాకమామిషేంటో తెలుసుకునే ముందు ఆ రెస్టారెంట్‌ ఎక్కడున్నదో చూద్దాం. ఆ రెస్టారెంట్‌కు వెళ్లి.. ఒక షరతు పాటిస్తే.. వైన్‌ బాటిల్‌ ఉచితంగా ఇస్తారు. ఇటలీలోని వెరోనాలో అల్‌ కండోమినియో అనే రెస్టారెంట్‌ ఉన్నది. అది తన కస్టమర్లకు ఉచిత వైన్‌ ఆఫర్‌ చేస్తున్నది. దానికి వారు పెట్టిన షరతు.. రెస్టారెంట్‌లో ఫోన్‌ వాడకుండా ఉండటమే. రెస్టారెంట్‌లోకి వెళ్లేటప్పుడే మీ ఫోన్‌ను వారికి హ్యాండోవర్‌ చేయాలి. వాళ్లు దానిని అక్కడ భద్రపరుస్తారు.

ఈ హోటల్‌ను యాంజెలో లెల్లా నెలకొల్పారు. మా రెస్టారెంట్‌కు వచ్చేవాళ్లు అంతా కలిసి మాట్లాడుకోవాలి. అంతేకానీ.. ప్రతి ఐదు క్షణాలకోసారి పదేపదే ఫోన్లు చూసుకుంటూ ఉండటం కాదు. ఈ రోజు సాంకేతికత అనేది అతిపెద్ద సమస్యకూడా అయి కూర్చున్నది. ప్రతి ఐదు సెకన్లకోసారి ఫోన్‌ చూసుకోవాల్సిన అవసరం ఏంటి? అని లెల్లా ప్రశ్నించారు. తానొక భిన్నమైన రెస్టారెంట్‌ను ప్రారంభించాలని అనుకున్నానని, అందుకే ఇటువంటి ఆఫర్‌ ఇచ్చానని తెలిపారు. ఫోన్‌ను చూసుకుంటూ కూర్చొనే బదులు.. పాత పద్ధతుల్లో ఒకరినొకరు చూసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్నదే తన అభిప్రాయమని వెల్లడించారు.

 

Latest News