ప్రపంచంలోనే అతి తక్కువ సమయం విమాన ప్రయాణం – ఎంతసేపో తెలిస్తే షాక్ తింటారు
ఓ బుల్లి విమానం రెండు దీవుల మధ్య అతి తక్కువ సమయం(Shortest flight) ప్రయాణిస్తుంది. లోగాన్ఎయిర్ (Loganair)నిర్వహించే ఈ విమాన సర్వీసు ఆర్క్నీ దీవుల మధ్య రాకపోకలు సాగిస్తుంది.

మామూలుగా మనం విమాన ప్రయాణమంటే గంటలు గంటలు ఊహించుకుంటాం. కానీ, ఒక స్కాటిష్ విమాన ప్రయాణం కేవలం ఒకటిన్నర నిమిషాలు.. అంటే 90 సెకన్లు(90 Seconds only) మాత్రమే ప్రయాణిస్తుంది. మీరు చదివింది నిజమే. 90 సెకన్స్ ఓన్లీ. విచిత్రంగా ఉంది కదా.. అదే మరి. ఈ విమాన ప్రయాణం యూకే ఆర్క్నీ దీవుల(Orkney Inslands)లోని వెస్ట్రే ఇంకా పాపా వెస్ట్రే( Westray and Papa Westray)లను కలుపుతుంది.
నిజానికి వాస్తవ ప్రయాణం నిమిషానికంటే(Less than a minute) తక్కువే. అంటే మామూలు ఫ్లైట్ ప్రయాణించే ఎత్తును చేరుకోవడానికంటే కూడా తక్కువ సమయమన్నమాట. ఈ విమాన ప్రయాణంలో పైలట్ స్టువార్ట్ లింక్లేటర్ ప్రయాణానికి కేవలం 53 సెకన్లే తీసుకుని రికార్డు కూడా నెలకొల్పాడు. ఈ ప్రయాణ దూరం 1.7 మైళ్లు అంటే 2.73 కిలోమీటర్లు. స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ ఎయిర్పోర్ట్ రన్వే పొడవు కంటే కూడా తక్కువ.
బ్రిటెన్–నార్మన్ బిఎన్2బి–26 ఐల్యాండర్(Britten-Norman BN2B-26 Islander) అనే బుల్లి విమానాన్ని ఈ ప్రయాణానికి వాడుతున్నారు. దీన్లో పదే పది సీట్లుంటాయి. ముందు సీట్లో కూర్చున్నవారు పైలట్ ఏం చేస్తున్నాడో చూడొచ్చు కూడా. దీన్లో ఎయిర్ హోస్టెస్ కూడా ఉండదు. ఉండి ఏం చేయాలి మరి? ఆవిడ వచ్చి సీటు బెల్టు ఎలా పెట్టుకోవాలనేది మొదలుపెట్టకముందే దిగాలి కదా.
పాపా వెస్ట్రేలో ఉండే దాదాపు 70మంది ప్రజలు వారి అవసరాల నిమిత్తం వెస్ట్రేకు రోజూ ప్రయాణిస్తారు. దానికే ఈ విమాన వాడకం. అన్నట్లు పడవలు కూడా కనబడుతున్నాయి. మరి పడవల్లో ప్రయాణించకుండా ఈ విమానమెందుకో తెలియదు. ఈ మధ్య విమానం విషయం తెలిసి పర్యాటకులు కూడా వస్తున్నారట. ఈ రెండు దీవుల మధ్య ప్రయాణం ఎంతో సుందరంగా ఉంటుందట. కిందుగా వెళ్తుంది కాబట్టి, సముద్రపు నీరు చాలా స్పష్టంగా, దీవుల పచ్చదనం ఎంతో అందంగా ఉంటుందని ప్రయాణీకుల మాట. నిజమే కదా.. మేఘాలలో ఏమీ కనబడకుండా గంటలకు గంటలు చేసే ప్రయాణం కంటే ఒకటిన్నర నిమిషపు ఈ ప్రయాణం ఇచ్చే జ్ఞాపకాలే ఎంతో విలువైనవి.