KTR: 18లోపు సెల్‌ఫోన్లు అప్పగించాలి: కేటీఆర్ కు ఏసీబీ ఆదేశం

మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ ఆదేశం
ఫార్ములా ఈ కారు రేసుపై ప్రశ్నలు
ఏడు గంటల పాటు సుదీర్ఘ విచారణ
అవసరమైతే మళ్లీ పిలుస్తామని వెల్లడి
ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి!
విధాత, హైదరాబాద్ : ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించారు. ఈ కేసులో రెండోసారి కేటీఆర్ ను విచారించిన ఏసీబీ అధికారులు అవసరమైతే మరోసారి పిలుస్తామని ఆయనకు స్పష్టం చేశారు.
కేసులో అధికారులు, ఎఫ్ఈవో సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్ లతో పాటు పలు ఆధారాలను ఏసీబీ అధికారులు కేటీఆర్ ముందు ఉంచి విచారించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి, ఐఓ ఆఫీసర్ మాజీద్ ఖాన్ ల బృందం విచారించింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు గత మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేపట్టారు. కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3 హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి లు ఇచ్చిన స్టేట్మెంట్ లను కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం. ఎఫ్ఈవోతో ఒప్పందాలు, నిధుల బదిలీ అంశాలు, కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు అన్న అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటన్న కీలక అంశాల పై కూడా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించినట్లుగా సమాచారం.
కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ కు ప్రయత్నం
కేటీఆర్ విచారణ సందర్భంగా ఆయన సెల్‌ఫోన్‌ను సీజ్ చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఇవాళ తాను విచారణకు సెల్‌ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పారు. ఈ- కారు రేసు సమయంలో వాడిన సెల్‌ఫోన్లను అప్పగించాలని కేటీఆర్‌ను అధికారులు ఆదేశించారు. ఈ నెల 18లోపు సెల్‌ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు. విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్‌ను వెళ్లారు.
కేటీఆర్ కు ఏసీబీ వరుస ప్రశ్నలు
కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచందర్ రావు ఉన్నారు. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై కేటీఆర్ కు ఏసీబీ ప్రశ్నలు సంధించింది. ఏసీబీ డైరక్టర్ విజయ్ కుమార్, జాయింట్ డైరక్టర్ తరుణ్ జోషిలతో కూడిన ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్‌ను ప్రశ్నించింది. ఆన్‌లైన్‌లో ఎఫ్ఈవో సంస్థ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఏసీబీ అధికారులు ఆ కంపెనీ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రశ్నలు వేశారని తెలిసింది. రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారు?.. ఇది నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా?..ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు.. క్యాబినెట్ ఆమోదం లేకుండానే నిధులు ఎందుకు మళ్ళించారు?..ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం లేదనుకున్నారా? వంటి ప్రశ్నలు వేశారు. అగ్రిమెంట్లు.. చెల్లింపులు అన్ని కూడా మీ ఆధ్వర్యంలోనే జరిగాయా? ప్రైవేట్ భాగస్వామిగా ఉన్న ప్రాజెక్టులో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది.. సివిల్ వర్క్స్ వరకే పరిమితమైన ప్రభుత్వం కాంట్రాక్టులోకి ఎందుకు వెళ్ళిందంటూ ఏసీబీ ప్రశ్నించింది. హెచ్ఎండిఏ నుంచి అధికారికంగా డబ్బులు ఎందుకు బదిలీ చేశారు.. పరిమితి లేకపోయినా హెచ్ఎండిఏ నుంచి డబ్బులు ఎలా ఇచ్చారు? మీరు బలవంతం చేస్తేనే డబ్బులు బదిలీ చేశామని అధికారులు చెబుతున్నారని…ఫెమా నిబంధనలు సైతం ఎందుకు ఉల్లంఘించారని కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించింది.
అరెస్టు ప్రచారంతో హల్చల్
ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు భద్రతా చర్యలు పెంచడం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం రేపింది. ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10, 12 పొడవునా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. బీఆర్ఎస్ ఆఫీస్, ఐసీసీసీ, ఏసీబీ ఆఫీస్ ఒకే దగ్గర ఉండడంతో ఈ ప్రాంతంలో పోలీసుల హడావుడి అధికమైంది. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ను అరెస్టు చేయవచ్చన్న ప్రచారంతో పాటు..విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ నన్ను ఈ రోజు అరెస్టు చేసే అవకాశముందంటూ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. దీంతో కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తెలంగాణ భవన్, ఏసీబీ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు ముందస్తు చర్యలుగా బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి తాళం వేశారు.