AP Liquor Scam| ఏపీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్..రూ.11 కోట్లు సీజ్

విధాత, హైదరాబాద్ : ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam)కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ శంషాబాద్ మండలం కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్స్ ఫామ్‌హౌస్(Sulochana Farms)లో సిట్ అధికారులు(SIT Raids) జరిపిన దాడుల్లో రూ.11 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. స్కామ్‌లో ఏ40గా ఉన్న వరుణ్ పురుషోత్తం (Varun) ఇచ్చిన సమాచారం మేరకు నేడు ఉదయం హైదరాబాద్‌లో సిట్ అధికారులు దాడులు చేశారు. ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి, చాణక్యల ఆదేశాల మేరకు వరుణ్, వినయ్ లు 12 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.11 కోట్లు గుర్తించారు. 2024 జూన్‌లో ఈ డబ్బులు ఇక్కడ దాచినట్లు విచారణలో తేలింది. వర్ధమాన్ కళాశాల వద్ద ఉన్న సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ యజమానిని విజయేందర్‌రెడ్డి అని సిట్ అధికారులు పేర్కొన్నారు.
నిన్న దుబాయ్ నుంచి వరుణ్ ను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సిట్ అధికారులు అరెస్టు చేశారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వరుణ్‌ను ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు రూ.3500 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్‌కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. వరుణ్ ను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.