భూ అమ్మకానికి ‘కుడా’ వేలం ప్రకటనపై సీపీఐ(ఎం) ధర్నా
‘కుడా’ కు ఆదాయం కావాలనుకుంటే ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి లీజుకు ఇవ్వడం ద్వారా, వ్యాపార సముదాయాలు, మల్టిప్లెక్స్ లను కట్టించి అద్దెకు ఇవ్వడం ద్వారా తన ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చున్నారు. వరంగల్ మహానగరం అభివృద్ధి చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయి.
విధాత, వరంగల్ ప్రతినిధి:
హనుమకొండ నడిబొడ్డులోని ప్రభుత్వ భూమిని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) అమ్మకానికి ముహుర్తం ప్రకటించింది. ఈ మేరకు బాలసముద్రంలోని రెండెకరాల 34 గుంటల భూమిని వచ్చే నెల 3వ తేదీన వేలం వేసే ప్రకటన జారీ చేసింది. రూ. 85 కోట్ల ప్రాథమిక ధరతో వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నగరం నడిబొడ్డున విలువైన ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు సిద్ధం కావడం పట్ల రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే ఈ భూమిని తక్షణావసరం కోసం అమ్మకానికి సిద్ధంకావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘కుడా’ తీరుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
బాలసముంద్రంలోని భూమి వేలం నిర్వహించడం పట్ల సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం వేలం వేసే స్థలం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. దీనికి ముందు స్థలాన్ని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ నాయకుల బృందం సందర్శించింది. ప్రభుత్వం, ‘కుడా’ తమ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్న ప్రధాన స్థలాలను విక్రయించి రానున్నకాలంలో ప్రజావసరాలు, ప్రభుత్వ అవసరాలకు స్థలం అవసరమైతే ఎక్కడికి పోతారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, భూ అమ్మకాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నగర అభివృద్ధికి నిధులు లేవని భూముల వేలానికి సిద్ధంకావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే ఇలాంటి వైఖరి తీసుకోవడం సరైంది కాదన్నారు. ‘కుడా’ కు ఆదాయం కావాలనుకుంటే ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి లీజుకు ఇవ్వడం ద్వారా, వ్యాపార సముదాయాలు, మల్టిప్లెక్స్ లను కట్టించి అద్దెకు ఇవ్వడం ద్వారా తన ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చున్నారు. వరంగల్ మహానగరం అభివృద్ధి చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. కానీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే నగర నడిబొడ్డున ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా నగరాన్ని అభివృద్ధి చేస్తామనడం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని, లేని పక్షంలో ప్రజాగ్రాహానికి గురికాక తప్పదని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ ధర్నాలో సీపీఎం నాయకులు గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, తిరుపతి, మంద సంపత్, భాను నాయక్, నాయకులు ఎం.రమాదేవి, కారు ఉపేందర్, మంద మల్లేశం, రమేశ్, కదిరి సుదర్శన్, మల్లన్న, జనగాం శ్రీను, మారుతి తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram