Elon Musk । కమలా హ్యారిస్‌ ప్రెసిడెంట్‌ అయితే.. వేసుకునే డ్రస్‌ తెలుసా? : చర్చను రేకెత్తించిన మస్క్‌ పోస్టింగ్‌

కమలా హ్యారిస్‌ అమెరికా ప్రెసిడెంట్‌ అయితే వేసుకునే డ్రస్‌ ఇదే అంటూ ఎలాన్‌ మస్క్‌ చేసిన పోస్టు.. నెట్టింట చర్చను రేకెత్తిస్తున్నది.

Elon Musk । కమలా హ్యారిస్‌ ప్రెసిడెంట్‌ అయితే.. వేసుకునే డ్రస్‌ తెలుసా? : చర్చను రేకెత్తించిన మస్క్‌ పోస్టింగ్‌

Elon Musk । అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, కమలా హ్యారిస్‌ మధ్య విమర్శలు ఎలా ఉన్నా.. మధ్యలో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేస్తున్న ప్రకటనలు వాడివేడి  చర్చను రాజేస్తున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధిస్తే మొదటి రోజు నుంచే ఆయన నియంతలా ప్రమాణం చేస్తారని, తాము అది జరుగనీయబోమని కమలా హ్యారిస్‌ (Kamala Harris) చేసిన పోస్టుకు ఎక్స్‌లో కౌంటర్‌ ఇచ్చిన మస్క్‌.. కమలాహ్యారిస్‌ను కమ్యూనిస్టు డిక్టేటర్‌తో పోల్చుతూ సుత్తీకొడవలి చిహ్నంతో ఎర్ర డ్రస్‌ వేసుకుని ఉన్న కమలా హ్యారిస్‌ ఏఐ జనరేటెడ్‌ ఇమేజ్‌ (AI-generated image)ను పెడుతూ ‘కమలా హ్యారిస్‌ తొలి రోజే కమ్యూనిస్టు నియంతగా (communist dictator) ప్రమాణం చేస్తారు. అప్పుడు ఆమె వేసుకునే డ్రస్‌ (outfit) ఏంటో తెలుసా? అని రాశారు.

అయితే.. మస్క్‌ పోస్టింగ్‌పై తలో విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది నిర్మాణాత్మకమైనది కాదని ఒక యూజర్‌ పేర్కొన్నారు. అసహ్యకరమైన అంశాలను తప్పుగా ప్రచారం చేయడం ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆ యూజర్‌ మండిపడ్డారు. ఇలాంటి పోస్టుల వల్లే ఎక్స్‌ను కొన్ని దేశాల్లో నియత్రించడం, నిషేధించడం చేస్తున్నారని మరొక యూజర్‌ గుర్తు చేశారు. ‘ఏఐ ప్రమాదకరమైనది చెప్పేవారిలో మీరు లేరా? మంచిది.. అందుకు మీరే గొప్ప ఉదాహరణ’ అని మరొకరు పేర్కొన్నారు. ‘ఇది ఫేక్‌ ఫొటో. ఫోర్జరీ  కేసులో మిమ్మల్ని అరెస్టు చేయవచ్చు..’ అని  ఒక యూజర్‌ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. కోత విధించాల్సిన కార్యక్రమాలను గుర్తించేందుకు ఫెడరల్ ఏజెన్సీల ఆడిటింగ్‌లో మస్క్‌ వంటి ముఖ్యమైన వ్యాపారవేత్తలను భాగస్వాములను చేసే ఉద్దేశంలో ట్రంప్‌ ఉన్నారని ఒక యూజర్‌ విడిగా పేర్కొన్నారు. దీనికి మస్క్‌ స్పందిస్తూ.. ‘నేను ఎదురుచూడలేను. ప్రభుత్వంలో చాలా వృథాలు ఉన్నాయి. అవి పోవాలి’ అని వ్యాఖ్యానించారు.