loan waiver । యాపొచ్చేదెప్పుడు.. అప్పుతీరెదెప్పుడు? రుణమాఫీకి ‘కుటుంబం’ తకరారు!

రుణమాఫీ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తారని, కుటుంబసభ్యుల నమోదు కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇదంతా అధికారులు గ్రామస్థాయిలోనే చేస్తారని చెప్పింది. అయితే అధికారులు మాత్రం గ్రామాల్లో కనిపించడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. గ్రామాలకు వాళ్లు రాకుండా.. కింది స్థాయి సిబ్బంది, కంప్యూటర్‌ ఆపరేటర్లతోనే పని కానిచ్చేస్తున్నారని సమాచారం.

loan waiver । యాపొచ్చేదెప్పుడు.. అప్పుతీరెదెప్పుడు? రుణమాఫీకి ‘కుటుంబం’ తకరారు!

loan waiver । రుణమాఫీ కోసం ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టు పరిస్థితి తయారైంది కొందరు రైతులకు. అన్నీ సవ్యంగానే ఉన్నాయనుకునేలోపే మరో తకరారు వచ్చిపడుతున్నది. దీంతో అసలు రుణమాఫీ (loan waiver) అవుతుందా? లేదా? అని కార్యాలయాల గచ్చులపై కూర్చొన్న సగటు రైతు తువ్వాలు విదిల్చి అసహనం వ్యక్తం చేస్తున్నాడు! కొండని తవ్వినా ఎలుకనూ పట్టలేనట్టు తయారైందని అంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి అధికారులు రైతు భరోసా (Rythu Bharosa) రుణమాఫీ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తారని, కుటుంబసభ్యుల నమోదు కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇదంతా అధికారులు గ్రామస్థాయిలోనే చేస్తారని చెప్పింది. అయితే అధికారులు మాత్రం గ్రామాల్లో కనిపించడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. గ్రామాలకు వాళ్లు రాకుండా.. కింది స్థాయి సిబ్బంది, కంప్యూటర్‌ ఆపరేటర్లతోనే పని కానిచ్చేస్తున్నారని సమాచారం.

 

సూర్యాపేట జిల్లా దిర్శించర్ల పంచాయతీకి (Dirshincharla Panchayat) చెందిన గుండ్రెడ్డి వెంకటరమణారెడ్డి అనే రైతు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఉదయం గ్రామంలోని రైతు వేదిక వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో పోగయ్యారు. అందరితోపాటు రైతు వేదిక వద్దకు వెళ్లిన వెంకట రమణారెడ్డి.. తనకు రుణమాఫీ కాలేదని, ఒకసారి పరిశీలించాలని కోరారు. అక్కడే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆధార్ నెంబర్ పరిశీలించి మీ ఫ్యామిలీ గ్రూపింగ్ కాలేదని, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు కాకపోవడంతో రుణమాఫీ కాలేదని తేల్చి చెప్పారు. ఏం చేయాలని అడిగితే.. గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తెచ్చుకోమని ఓ సలహా పడేశారు. దీంతో వెంకట రమణారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసి రుణమాఫీ కోసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వాలని అభ్యర్థించాడు. కానీ.. అక్కడ వచ్చిన సమాధానం విని అవాక్కవడం వెంకట రమణారెడ్డి వంతైంది. అసలు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ ఇవ్వాలని తమకు ఎలాంటి సలహాలు రాలేదని చేతులెత్తేశాడు. దీనికి ఏం చేయాలని అడిగితే.. తాసిల్దార్‌ను అడగాలని ఆయన కూడా ఒక సలహా ఇచ్చి చేతులు దులుపుకొన్నాడు.

 

ఆ సలహాను కూడా మోసుకుంటూ.. సదరు రైతు.. తాసిల్దార్‌ను కలిశాడు. ఇక్కడైనా తనకు పరిష్కారం దొరుతుందని ఆశపడ్డాడు. ఫ్యామిలీ సర్టిఫికెట్‌ (family member certificate) ఇస్తేనే తనకు రుణం మాఫీ అవుతుందని, అది ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని వేడుకున్నాడు. ఇక్కడ కూడా ఆయనకు మరో ట్విస్టు ఎదురైంది. అసలు ఫ్యామిలీ నిర్ధారణ చేయడానికి తమకు ఎలాంటి ఫార్మాట్‌ ఇప్పటి వరకూ రాలేదని చావు కబురు చల్లగా చెప్పాడు. మరేంటి దారి అని అడిగితే.. కిసాన్‌ సెల్‌కు (Kisan cell) ఫోన్‌ చేయాలని ఆయన కూడా ఫ్రీగానే సలహా ఇచ్చాడు. సరేకదా అని కిసాన్‌ సెల్‌కు ఫోన్‌ చేస్తే.. వారు కూడా అబ్బే.. మాకు కూడా ఇంకా ఎలాంటి ఫార్మాట్‌ రాలేదండీ అని వినమ్రపూర్వకంగా చెప్పారు. ఒకసారి మండల వ్యవసాయ శాఖ అధికారి (ఎఈవో)ను సంప్రదించాలని వాళ్లు కూడా ఉచితంగానే సలహా ఇచ్చారు.

 

సదరు ఏఈవోతో మాట్లాడగా అగ్రికల్చర్ యాప్ వస్తుందని, కానీ తమకు ఇంకా యాప్ రాలేదని తెలిపారు. దాదాపుగా వారం పది రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని సదరు అధికారి వెంకట రమణారెడ్డికి సమాధానం ఇచ్చారు. దీంతో అసలు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు? అని అడిగితే.. గ్రామానికే అధికారులు వచ్చి మీ ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకుంటారని చెప్పారు. దీనికి వారంపదిరోజులు పడుతుందని చెప్పారు. ఇదంతా చూసిన రైతు.. ఇంతకూ రుణమాఫీ జరుగుతుందా? లేదా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు.

 

ఇది కూడా చదవండి..

Agricultural loan waiver । వ్యవసాయ రుణమాఫీకి ఇంకా చిక్కుముడులెన్నో..