Increased Railway Fares| అమలులోకి వచ్చిన పెంచిన రైల్వే చార్జీలు

Increased Railway Fares| అమలులోకి వచ్చిన పెంచిన రైల్వే చార్జీలు

న్యూఢిల్లీ: పెంచిన రైల్వే చార్జీలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏసీ తరగతుల్లో కిలోమీటర్ కు రూ.2 పైసలు, నాన్ ఏసీలో కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున ఛార్జీలను పెంచారు. ఐదేళ్ల తర్వా మళ్లీ రైల్వేలో చార్జీలు పెరిగాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో 500 కిలోమీటర్ల వరకు సాధారణ ఛార్జీలు అమలవుతాయి. అయితే 501 నుంచి 1500 కిలోమీటర్ల వరకు టికెట్‌పై రూ.5, తర్వాత1501 కిలోమీటర్ల నుంచి 2500 కిలోమీటర్ల వరకు టికెట్‌పై రూ.10 పెరిగాయి. 2501 నుంచి 3000 కిలోమీటర్ల వరకు రూ.15 చొప్పున పెంచారు. ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్ కు అరపైసా చొప్పున పెంచారు. మెయిల్/ఎక్స్‌ప్రెస్‌(నాన్ ఏసీ) రైళ్లలో టికెట్లపై నాన్ ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున పెంచారు.

అన్ని రకాల రైళ్లలో ఏసీలో అన్ని తరగతులకు కిలోమీటర్ రూ.2 పైసలు చొప్పున పెంచారు. ఇప్పటికే రిజర్వేషన్‌ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు వర్తించవని, జులై 1 నుంచి కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్‌ బుకింగ్‌లు అమల్లోకి వస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. రిజర్వేషన్‌ ఛార్జ్, సూపర్‌ఫాస్ట్‌ సర్‌ఛార్జీల్లో మార్పు ఉండదని స్పష్టం చేసింది.

మరోవైపు రైళ్లలో తత్కాల్‌ బెర్తులను తీసుకునేందుకు ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి నిబంధన మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. ఆన్‌లైన్లో రిజర్వేషన్‌ చేసుకునేవారికి జులై 1 నుంచి, సాధారణ కౌంటర్లలో తీసుకునేవారికి జులై 15 నుంచి దీనిని వర్తింపజేస్తారు.