Telangana | చేసిన మంచి.. చెప్పుకోలేని దుస్థితి.. డైలమాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

రైతు భరోసా, ఇతర గ్యారెంటీల అమల్లో తీవ్ర జాప్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తక్కువ కాలంలోనే వ్యతిరేకత పెరుగుతున్నది. చేసిన మంచిని కూడా చెప్పుకోలేని స్థితిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉండగా.. చేయాల్సిన పనులపై ఒత్తిడి పెరుగుతున్నది.

Telangana | చేసిన మంచి.. చెప్పుకోలేని దుస్థితి.. డైలమాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం
  • గ్రామస్థాయిలో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌
  • స్థానిక ఎమ్మెల్యేలపైనా వాటి ప్రభావానికి చాన్స్‌
  • రాబోయే లోకల్‌ పోల్స్‌లో గట్టెక్కేదెలా?
  • అంత‌ర్మ‌థనంలో కాంగ్రెస్ నాయకులు
  • నష్టనివారణకు దిగిన సీఎం రేవంత్‌రెడ్డి
  • మే 1 నుంచి నియోజ‌క‌వ‌ర్గాల పర్యటన

(విధాత ప్రత్యేకం)
దేశంలో ఎవరూ చేయని సాహసం చేస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది! కానీ.. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నది. సమగ్రంగా బీసీ కులగణన చేసినా.. దానిపై ప్రజల్లో ప్రభావవంతంగా ప్రచారం చేసుకోలేక పోయింది. ఈ రెండూ దీర్ఘకాలంలో ప్రజలకు మేలు చేసేవి. ఇంతచేసీ.. చేసిన మంచిని చెప్పుకోలేని దుస్థితిని కాంగ్రెస్‌ ఎదుర్కొంటున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ప్రజలకు వివరించి చెప్పుకోలేక పోవడంతో పాజిటివ్‌ ప్రచారం కంటే నెగెటివ్‌ ప్రచారమే ఎక్కువైందని అంటున్నారు. ఫలితంగానే ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే గ్రామస్థాయిలో ముఖ్యంగా రైతుల్లో తీవ్ర వ్యతిరేకతను కొనితెచ్చుకున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీని ప్ర‌భావం ఎమ్మెల్యేల‌పై కూడా ప‌డింద‌న్న చ‌ర్చ గ్రామ స్థాయిలో జ‌రుగుతున్నది. ఈ పరిస్థితిలో రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్క‌డం ఎలాగనే సందేహంలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారని రాజ‌కీయ ప‌రిశీల‌కుడొక‌రు అన్నారు. గెలుస్తామ‌న్న భ‌రోసా లేక‌నే స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికలను కూడా వాయిదా వేస్తూ వ‌స్తున్నార‌న్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్య‌క్తం చేశారు.

ఎవరూ చేయని సాహసం
కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఎవ‌రూ చేయ‌ని స‌హ‌సం తెలంగాణ‌లో చేసింది. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చ‌ట్టాన్ని అమ‌లు చేసింది. అలాగే కుల‌గ‌ణ‌న చేప‌ట్టి బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రం కూడా కుల‌గ‌ణ‌న చేప‌ట్ట‌లేదు. బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల చ‌ట్టం చేయ‌లేదు. కేంద్రం కూడా కుల‌గ‌ణ‌న చేయ‌డానికి వెనుకాడుతున్న స‌మ‌యంలో రేవంత్ స‌ర్కారు సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకొని అమ‌లు చేసింది. కానీ దీనిపైన పాజిటివ్ టాక్ తెచ్చుకోలేక‌పోయింది. ప్ర‌చారం చేసుకోలేక‌నా, ప్ర‌జ‌ల‌కు అర్థం చేయించ‌డంలో విఫ‌ల‌మైందా? అన్న చ‌ర్చ ఉన్న‌ది. కొంతమంది కాంగ్రెస్ నేత‌లు కూడా కుల‌గ‌ణ‌ను త‌ప్పు ప‌ట్టిన తీరు విప‌క్షాల విమర్శలకు అవకాశం ఇచ్చినట్టయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తోడైన పథకాల అమలులో జాప్యాలు
కాంగ్రెస్ స‌ర్కారుపై అతి త‌క్కువ కాలంలో ఎందుకంత వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుంద‌న్న దానిపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. ముఖ్యంగా రైతు భ‌రోసాను పూర్తి స్థాయిలో అమ‌లు చేయ‌లేదని అంటున్నారు. బీఆరెస్ స‌ర్కారు సీలింగ్ లేకుండా రైతులంద‌రికీ పెట్టుబ‌డి స‌హాయం అందించింది. అయితే.. దానిలో కొన్ని అవకతవకలు కూడా ఉన్నాయి. ఎన్నిక‌ల‌కు ముందే భూస్వాముల‌కు కాకుండా రైతుల‌కే భ‌రోసా ఇస్తామ‌న్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్ప‌టికి మూడు సీజ‌న్లు అయిన‌ప్ప‌టికీ భ‌రోసా ఇవ్వ‌లేక పోయింది. ఈ ఏడాది 3 ఎక‌రాల రైతుల వ‌ర‌కు మాత్ర‌మే భ‌రోసా ఇవ్వ‌గ‌లిగింది. ఎన్ని ఎక‌రాల వ‌ర‌కు రైతు భ‌రోసా ఇవ్వాల‌నుకుంటున్నారో అంత మేర‌కు ప్ర‌క‌టించి క్ర‌మం త‌ప్ప‌కుండా ఇస్తే ఈ వ్య‌తిరేక‌త వ‌చ్చేది కాద‌ని క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఒక రైతు అన్నాడు. ఇంతే కాకుండా రుణ‌మాఫీ అమ‌లు జ‌రిగిన తీరుపై గ్రామాల్లో నెగెటివ్ చ‌ర్చ జ‌రుగుతున్నది. రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు రైతుల‌కు రుణ‌మాఫీ అని ప్ర‌క‌టించారు కానీ చాలా మంది రైతులు త‌మ‌కు రుణ‌మాఫీ కాలేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆధార్‌లో త‌ప్పులున్నాయ‌ని, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంద‌ని, ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు చూపిస్తూ రిజెక్ట్ చేశార‌ని అంటున్నారు. ఇంతే కాకుడా కేసీఆర్ ఉన్న‌ప్పుడు ల‌క్ష రుణం మాఫీ అయిన వాళ్ల‌కే తిరిగి రేవంత్‌రెడ్డి వ‌చ్చిన త‌రువాత రెండవ సారి మాఫీ అయింద‌ని చెపుతున్నారు. ఇలాంటి కార‌ణాల చేత గ్రామాల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు చెప్పారు.

గ్రామస్థాయి పర్యటనలకు సీఎం
గ్రామ స్థాయిలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త వ‌స్తున్న తీరును గుర్తించిన రేవంత్ రెడ్డి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో స్వ‌యంగా ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకే న‌ష్ట నివార‌ణ చర్య‌గా సీఎల్‌పీ స‌మావేశం నిర్వ‌హించి, ఏ ఒక్క‌రు కూడా హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. అలాగే మే1 వ‌తేదీ నుంచి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌ర్య‌టిస్తాన‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డ‌కు రావాలో మీరే నిర్ణ‌యించాల‌ని ఎమ్మెల్యేల‌కు సూచించారు. ఎమ్మెల్యేలు నిర్ణ‌యించిన ప్ర‌కారం తాను వ‌చ్చి స‌భ‌ల‌లో పాల్గొంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇలా అన్ని నియోక‌వ‌ర్గాలలో ప‌ర్య‌టించ‌డం ద్వారా పార్టీపై ప‌ట్టు సాధించ‌డంతో పాటు, నేరుగా ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డానికి రేవంత్ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు.