CM Revanth Reddy| భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్మించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జపాన్, టోక్యో, సింగపూర్, దుబాయ్ వంటి విదేశాల నగరాల గురించి గొప్పగా చెప్పుకోవడం కాకుండా.. విదేశీయులే చెప్పుకునే తరహాలో మన భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం చేస్తామన్నారు.

విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ(Future City) భవిష్యత్ తరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్మించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇక్కడ నాకు ఏవో భూములున్నాయని..అందుకే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామన్న ప్రతిపక్షాల ఆరోపణలలో నిజం లేదని కొట్టిపారేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్స్ డెవలప్మెంట్ అథారిటీకి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి పునాది రాయి వేసి శంకుస్థాపన చేశారు. అలాగే రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు వన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 400ఏళ్ల క్రితం కులీకుత్బుషా హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా గొప్ప నగరంగా ఎదుగాలని నిర్మాణం చేపట్టారో..మేం కూడా ఈ రోజు ఫ్యూచర్ సిటీ నిర్మాణం అదే ఆలోచనతో తలపెట్టామన్నారు. చంద్రబాబు, వైఎస్ ల చొరవతో సైబరాబాద్, హైటెక్ సిటీ, ఔవర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ వంటివి వచ్చాయని.. వారు ప్రణాళిక బద్దమైన ఆలోచన చేసినందునే ఈ రోజు మన పిల్లలు ఐటీ రంగంలో ఎదుగుతున్నారన్నారు. వారి స్పూర్తితో మేం ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టామన్నారు. జపాన్, టోక్యో, సింగపూర్, దుబాయ్ వంటి విదేశాల నగరాల గురించి గొప్పగా చెప్పుకోవడం కాకుండా.. విదేశీయులే చెప్పుకునే తరహాలో మన భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం చేస్తామన్నారు.
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఫ్యూచర్ సిటీ వంటి పెద్ద అభివృద్ధి పనులు తలపెట్టినప్పుడు కొందరికి నష్టం, కష్టం కల్గవచ్చని అటువంటి నిర్వాసితులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యతని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ నిర్వాసితులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, టౌన్ షిప్ లు, ఫ్యూచర్ సిటీలో ఉద్యోగాలు కల్పించాలని అధికారులకు ఆదేశిస్తామన్నారు. కోర్టులకు వెళ్లి సమస్యల పాలవ్వకుండా..ప్రభుత్వంతో చర్చించి నిర్వాసితులు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. నేను స్వయంగా మీ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా నిర్వాసితులు తమ సమస్యలపై ప్రభుత్వంతో సంప్రదించాలని.. నిర్వాసితులకు న్యాయం చేసేలా అధికారులను, జిల్లా మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశిస్తామని..అందరికి నష్టపరిహారం ఇస్తామన్నారు. ఎవరికి అన్యాయం చేసే ఉద్దేశం మాకు లేదన్నారు.
డిసెంబర్ నుంచే ఫ్యూచర్ సిటీ కార్యకలాపాలు
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆథారిటీ కార్యాలయం భవనం, స్కిల్స్ యూనివర్సిటీ, రేడియల్ రోడ్డు నిర్మాణాలు వచ్చే డిసెంబర్ నెల కల్లా పూర్తి చేసి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. నెలకు 3సార్లు తాను ఇక్కడికి వస్తానని..విదేశీ సంస్థల పెట్టుబడుల ఒప్పందాలు సవచివాలయంలో కాకుండా ఇక్కడే చేసుకుంటామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు సహా అధికార వ్యవస్థలు అన్ని ఫ్యూచర్ సిటీకి వచ్చి ఇక్కడి సమస్యలు పరిష్కరించి.. అభివృద్ధి పనులు కొనసాగించాలని ఆదేశిస్తామన్నారు. సింగరేణి కంపెనీకి 10ఎకరాల భూమి ఇక్కడ కేటాయిస్తామన్నారు. వెంటనే ఏడాదిలోగా వారు కార్యాలయం నిర్మించాలన్నారు.
ఫ్యూచర్ సిటీతో ఆ ప్రాంతాలకు కనెక్టివిటీ
భారత్ ఫ్యూచర్ సిటీకి శంషాబాద్ విమానాశ్రయం, శ్రీశైలం రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాలకు అనుసంధాన రోడ్లు వేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు పోర్టు లేనికొరతను తీర్చేందుకు ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు 12లైన్ల రహదారి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామని..చైన్నైకి, అమరావతి మీదుగా ఫ్యూచర్ సిటీ నుంచి బుల్లెట్ ట్రైన్ రాబోతుందన్నారు. ఫ్యూచర్ సిటీకి అవసరమైన విద్యుత్తు, నీళ్ల వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్స్, డ్రైనేజీలు, కాలుష్య రహిత సిటీగా ఉండబోతుందన్నారు. ప్రపంచ ఉన్నతమైన కంపెనీలు ఫార్చూన్ ఫైవ్ హ్యండ్రెడ్ కంపెనీలు ఫ్యూచర్ సిటీకి రప్పిస్తామని తెలిపారు.