LPG Gas Shortage | గ్యాస్ కొరతతో కరెంటు పొయ్యిల ధరలకు రెక్కలు!
పశ్చిమాసియా యుద్దంతో భారత్ లో ఎల్‌పీజీ గ్యాస్ కొరత..బ్లాక్ మార్కెట్ తో పెరిగిన ధరల భారం మోయలేక కొందరు జనం గ్యాస్ పొయ్యిలను పక్కన పెట్టి కరెంటు పొయ్యి (ఇండక్షన్ కుక్కర్), రైస్ కుక్కర్ లు, ఎలక్ట్రికల్ కెటిల్ ల వైపు మళ్లుతున్నారు. దీంతో ఎలక్ట్రానిక్ మార్కెట్లలో ఇండక్షన్ కుక్కర్లు, రైస్ కుక్కర్లు, కేటిల్స్, ఎయిర్ ఫ్రయర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్దంతో భారత్ లో వంట గ్యాస్(ఎల్పీజీ) సరఫరాలో నెలకొన్న కొరత ప్రజలను పరేషాన్ చేస్తుంది. ఎల్‌పీజీ గ్యాస్ కొరత..బ్లాక్ మార్కెట్ తో పెరిగిన ధరల భారం మోయలేక కొందరు జనం గ్యాస్ పొయ్యిలను పక్కన పెట్టి కరెంటు పొయ్యి (ఇండక్షన్ కుక్కర్), రైస్ కుక్కర్ లు, ఎలక్ట్రికల్ కెటిల్ ల వైపు మళ్లుతున్నారు. దీంతో ఎలక్ట్రానిక్ మార్కెట్లలో ఇండక్షన్ కుక్కర్లు, రైస్ కుక్కర్లు, కేటిల్స్, ఎయిర్ ఫ్రయర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కరెంట్ కుక్కర్ల అమ్మకాలు రెండింతలు పెరిగిపోయాయి. డిమాండ్ పెరగడంతో ఇదే అదనుగా ఇండక్షన్ స్టవ్‌ల ధరలను కూడా అమ్మకందారులు అమాతంగా పెంచేశారు. ఒక్కసారిగా రూ. 400 – 500 వరకు పెంచేశారు.
గ్యాస్‌తో పోలిస్తే ఇండక్షన్ వంట ఖర్చు దాదాపు 30 నుంచి 40 శాతం తక్కువగా ఉంటోందని గృహిణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు వంట గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా కరెంటు పొయ్యిలను వాడుతున్నారు.
కట్టెలు, కర్ర బొగ్గుకు పెరిగిన డిమాండ్
ఎల్పీజీ సిలిండర్ల సరఫరా కొరతతో హోటల్స్, రెస్టారెంట్లు, డాబా హోటల్స్, క్యాంటీన్లు, హాస్టల్స్, దేవాలయాలు వంటి వాటిలో కర్ర బొగ్గు, కట్టెలతో వంటలను సిద్దం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కట్టెలు, కర్ర బొగ్గుకు సైతం డిమాండ్ పెరిగిపోయింది. రంజాన్ మాసం నేపథ్యంలో హోటళ్లు, ఇరానీ కాఫీ హౌసులు పెద్ద సంఖ్యలో కట్టెలు, కర్రబొగ్గు, కరెంట్ పొయ్యిలను వాడుతున్నాయి. బిర్యానీ, హలీమ్, తందూరీ రొట్టెలకే సిలిండర్లు దొరకని పక్షంలో కట్టెలను వాడుతున్నారు. నగరంలోని క్లబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు పరిమిత మెనూ మాత్రమే అందిస్తున్నాయి. ఎక్కువగా గ్యాస్ వాడే స్వీట్లు, బేకరీ, పాత కూరలు, రొట్టెల తయారీ నిలిపివేయబడ్డాయి. చిన్న టిఫిన్ సెంటర్లు కూడా గ్యాస్ సమస్య వల్ల మూతపడుతున్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్ (మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి)లో పరిస్థితి ఇంకా విషమంగా మారింది. హాస్టళ్లలో గ్యాస్ నిల్వలు తక్కువగా ఉండటంతో యాజమానులు పరిమిత వంటకాలకే పరిమితమవుతున్నారు.
హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.4వేలు..ఇండెన్ గ్యాస్ సర్వర్ డౌన్
హైదరాబాద్ లో కమర్షియల్ సిలింగర్ ధర బ్లాక్ మార్కెట్ లో రూ.4000కు చేరింది. ఏజెన్సీల దగ్గర ‘నో స్టాక్’బోర్డులు పెట్టి బ్లాక్‌లో ఇస్తే రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా సిలిండర్ల తరలిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండెన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ సర్వర్ డౌన్ కావడం మరింత సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత భయంతో వినియోగదారులు భారీగా రీఫిల్ బుకింగ్స్ చేయడంతో ఇండెన్ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలింది. సాధారణం కంటే 8–10 రెట్లు ఎక్కువ కాల్స్ రావడంతో IVRS, ఆన్లైన్ సిస్టమ్స్ ఓవర్‌లోడ్ అయ్యాయి. ఉదయం నుంచి ఫోన్, యాప్ ద్వారా బుకింగ్ చేయలేక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎల్బీపీజీ డెలివరి రెండున్నర రోజుల్లేనే
దేశంలో ఎల్పీజీ సిలిండర్ రెండున్నర రోజుల్లోనే సరఫరా కాబడుతుందని, దేశీయంగా అవసరమైన వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. అయినప్పటికి జనం, ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్స్ నిర్వాహకుల నుంచి, క్యాంటీన్‌లు, బేకరీలు, డాబాహోటల్స్ నుంచి పెద్ద ఎత్తున వంట గ్యాస్ కోసం డిమాండ్ ఎదురవుతుంది. గ్యాస్ కొరత కారణంగా ఏజెన్సీలు తాత్కాలికంగా బుకింగ్ నిలిపివేసి.. బల్క్ సరఫరాలో అడ్డంకులు సృష్టించాయి. కృత్రిమ కొరతకు తెరలేపాయి. ఫలితంగా డొమెస్టిక్ సిలిండర్ రూ.965కు అందితే.. కొందరు ఏజెన్సీలు రూ.1200 వరకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ కూడా దాదాపు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు విక్రయిస్తున్నారని తెలుస్తుంది. LPG, CNG ఆధారిత ఆటోలు, కారు ఫిల్లింగ్ కేంద్రాల్లో కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లు ఏర్పడుతున్నాయి.
రైళ్లలోనూ ఆహార సరఫరాకు ఆటంకాలు
ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో భారత్ లోని రై ప్రయాణికులకు భోజన సదుపాయం కల్పించే IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తన కార్యకలాపాలను పరిమితం చేస్తుంది. ప్రయాణికులకు ఆహారం అందించేందుకు రైల్వే స్టేషన్లలోని బేస్ కిచెన్ లపై ఆధారపడకుండా ‘రెడీ టు ఈట్’ ప్లాన్ ను అమలులోకి తెస్తుంది. రైల్వే స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూమ్‌లు, ‘జన్ ఆహార్’ సెంటర్లలో తగినంత ‘రెడీ టు ఈట్’ ఆహార పదార్థాలను నిల్వ ఉంచాలని IRCTC సూచించింది.
ఇవి కూడా చదవండి :
Gold, silver price today| తగ్గిన బంగారం, వెండి ధరలు
Monalisa | ప్రేమ వివాహంతో వార్తల్లోకి మోనాలిసా .. కచ్చితంగా లవ్ జిహాదే అంటూ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram