విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలతో పాటు బంగారం, వెండి ధరలు కూడా ప్రభావితం అవుతున్నాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గి, రూ. 1,59,490వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 400తగ్గి రూ.1,46,200 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,95,000 వద్ద కొనసాగుతుంది.
భవిష్యత్తుపైనే బంగారం ధరలపై ఆశలు
పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బంగారం, వెండి ధరలలో హెచ్చు థగ్గులు తప్పవని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ద పరిణామాలతో పాటు అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు, డాలర్-రూపాయి మారకపు రేటు, దిగుమతి సుంకాలు, దేశీయ డిమాండ్ వంటి పరిణామాలు విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
అయితే అంతర్జాతీయ కమోడిటీ నిపుణుడు, సాక్సో బ్యాంక్ కమోడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలే హాన్సెన్ ప్రకారం.. రాబోయే 12 నెలల్లో బంగారం ధర ఔన్సుకు 6000 డాలర్లకు పెరగవచ్చని కథనం. ఒకవేళ అలా జరిగితే, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 2.12 లక్షలకు చేరుకుంటుంది.
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళనను పెంచాయి. పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారం వంటి సురక్షితమైన ఆస్తులలోకి మళ్లిస్తున్నారు. అలాగే, పశ్చిమ ఆసియా సంక్షేమం కారణంగా చమురు ధరలు పెరిగాయి, ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ కాలంలో పెట్టుబడిదారులు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి బంగారంలో పెట్టుబడిని పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి కొనసాగితే, రాబోయే నెలల్లో బంగారం ధరల పెరుగుదల కొనసాగవచ్చు అని విశ్లేషిస్తున్నారు.
