Gulzar House| గుల్జారీ హౌజ్ అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ : మంత్రి పొన్నం

Gulzar House| విధాత, హైదరాబాద్ : గుల్జారీ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ , ఫైర్ డీజీ నాగిరెడ్డి , హైడ్రా కమిషనర్ రంగనాథ్ , టీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ లతో కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.
17మంది ప్రాణాలు కోల్పోయిన గుల్జారీ హౌజ్ అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు.. ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రికి కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వనుంది. అలాగే భవిష్యత్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు, సూచనలు చేయనుంది.
కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం సీఎం, డిప్యూటీ సీఎంలు,ఉన్నతాధికారులు సమీక్ష చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పొన్నం తెలిపారు.