Fee Reimbursement | నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్!

ప్రభుత్వం చెప్పిన విధంగా తమకు కోట్ల రూపాయల ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 1వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నిర్ణయించాయి.

  • By: TAAZ |    telangana |    Published on : Oct 20, 2025 7:12 PM IST
Fee Reimbursement | నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్!

Fee Reimbursement | తెలంగాణలో ఫీజు రీయింబర్స్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మరోసారి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోతే బంద్ తప్పదని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల హెచ్చరించాయి. తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా నవంబర్ 1వ తేదీ లోపు రూ.900 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వినతి పత్రం అందజేశారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చెల్లింపులపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదంటూ ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. నవంబర్ 3 నుంచి కాలేజీలను మూసివేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫాతీ) నిర్ణయం తీసుకుంది. కాగా, గతంలో ఫీజు బకాయిల సమస్యపై అక్టోబర్ 13 వ తేదీ నుంచే బంద్‌కు వెళ్లాలని భావించిన యాజమాన్యాలు.

అయితే, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో జరిగిన సమావేశం తరువాత బంద్ నిర్ణయాన్ని వాయిదా వేశాయి. దీపావళి పండగలోపు రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని వేం నరేంద్ర రెడ్డి హామీ ఇవ్వడంతో.కాలేజీల యాజమాన్యాలు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. కాగా, దీపావళి పండుగా వచ్చినా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలో ‘ఫాతీ’ కార్యవర్గం ఆదివారం సమావేశమై బంద్‌కు వెళ్లడమే శరణ్యమని తీర్మానించింది. తమ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేస్తూ 22న ప్రభుత్వానికి నోటీసులు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ బంద్‌లో ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ, లా, నర్సింగ్, ఎంసీఏ, ఎంబీఏ, బీఎడ్ వంటి అన్ని వృత్తివిద్యా కాలేజీలు పాల్గొననున్నాయి. కాగా, కళాశాలల యాజమాన్యాలు ఇచ్చే నోటీసుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రభుత్వ మూస ధోరణి చర్యతో విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు మరోవైపు వ్యక్తం అవుతున్నాయి.