హైడ్రా నాలల పూడిక తీత పనుల్లో బయటపడిన మృత‌దేహం!

హైదరాబాద్ నగర పరిధిలోని మోతుకుల కుంట ఔట్‌లెట్లో నాలాల్లో హైడ్రా యంత్రాంగం పూడిక తీత పనులు కొనసాగిస్తున్న క్రమంలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం బయటపడింది.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగర పరిధిలోని మోతుకుల కుంట ఔట్‌లెట్లో నాలాల్లో హైడ్రా యంత్రాంగం పూడిక తీత పనులు కొనసాగిస్తున్న క్రమంలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం బయటపడింది. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌లం మ‌చ్చ‌బొల్లారంలోని మోతుకుల కుంట ఔట్లెట్ నాలాలో బుధ‌వారం హైడ్రా డీఆర్ ఎప్‌, మాన్సూన్ రెస్పాన్స్ టీంలు క‌ల‌సి పెద్ద‌మొత్తంలో పేరుకుపోయిన చెత్త‌ను జేసీబీతో తొల‌గిస్తుండ‌గా.. ఈ మృత‌దేహం చెత్త‌తో క‌ల‌సి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏమాత్రం గుర్తు ప‌ట్ట‌డానికి వీలు లేకుండా.. ఎముక‌ల‌కు శ‌రీరం అతుక్కుని ఉంది. అల్వాల్ పోలీసుల‌కు హైడ్రా సిబ్బంది స‌మాచారం అందించారు. పోలీసులు వ‌చ్చి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ మృతదేహం సుమారు 15 రోజుల క్రితం నాటిదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం గుర్తింపు కోసం పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

మరోవైపు క‌బ్జాలతో వ‌ర‌ద నీటి ప్ర‌వాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయంటే ఇప్పటికే హైడ్రా ప్ర‌జావాణికి 54 ఫిర్యాదులు అందాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ ఎంసీ), సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(సీఎంసీ), మ‌ల్కాజిగిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(ఎంఎంసీ)తో పాటు ఇరిగేష‌న్‌, పోలీసు శాఖ‌ల స‌హ‌కారంతో హైడ్రా పెద్ద‌ఎత్తున కాలువ‌ల్లోంచి చెత్త‌ను తొల‌గిస్తోంది. నాలాల నుంచి కేబుల్ వైర్లు, చెత్త క‌వ‌ర్లు, ప‌రుపులు, దిండులు, దుప్ప‌ట్లు, సోఫాలు, కుర్చీలు.. ఇలా ఇంట్లో ప‌నికి రాని వ‌స్తువంతా మురుగు కాలువ‌ల్లోకి చేరుతోంది. వ‌ర‌ద నీరు సాఫీగా వెళ్ల‌డానికి వీలుగా నిర్మించిన బాక్స్ డ్రైన్లు చెత్త‌తో, ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌తో నిండిపోతున్నాయి. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ వ‌ర్షం నీరు కాల‌నీల‌ను, ర‌హ‌దారుల‌ను ముంచెత్తుతోంది. నాలాల చెత్త తొలగింపు ప్రక్రియలో అలాంటి వ్యర్థాలు భారీగా వెలువడుతున్నాయి. వ‌ర్షం ప‌డేట‌ప్పుడు వ‌ర‌ద నీరు ముంచెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న హైడ్రా డీఆర్ ఎఫ్ (డిజాస్ట‌ర్ రెస్పాన్స్‌), మెట్‌(మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్స్‌) 24 X 7 మాదిరి ప‌ని చేసి చెత్త‌ను తొల‌గించే ప‌నుల్లో నిమ‌గ్న‌మైంది.

Latest News