KCR| పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కృష్ణా జలాల సాధనకు ప్రజాపోరాటం : కేసీఆర్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణా జలాల్లో నీటి వాటాల సాధనకు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలలో గ్రామగ్రామాల్లో పోరాటం చేస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామని.. నేను స్వయంగా బహిరంగ సభల్లో పాల్గొంటానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపైన ఇప్పటిదాక ఒకటి..ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని, తోలు తీస్తామని, ఎక్కడికక్కడే నిలదీస్తామన్నారు.
విధాత, హైదరాబాద్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru Rangareddy lift irrigation) కృష్ణా జలాల్లో నీటి వాటాల సాధనకు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలలో గ్రామగ్రామాల్లో పోరాటం చేస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామని.. నేను స్వయంగా బహిరంగ సభల్లో పాల్గొంటానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపైన ఇప్పటిదాక ఒకటి..ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని, తోలు తీస్తామని, ఎక్కడికక్కడే నిలదీస్తామన్నారు. గోదావరి జలాల దోపిడిపైన, ఇటు కృష్ణా జలాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను పట్టించుకోవడం లేదని, అందుకే స్వయంగా నేనే రంగంలోకి దిగానని, ప్రజాక్షేత్రంలో పోరాడుతామన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఎవరితోనైనా, ఎందాకైనా కొట్లాడుతామన్నారు. కృష్ణా, గోదావరి జలాల దోపిడి వెనుక ఎవరి కుట్ర దాగి ఉంది..ఎవరి ఒత్తిడి ఉందో నేను మాట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు. కేంద్రం ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి మీరు 90టీఎంసీలు పెట్టుకున్నారని చెబుతున్నారని, 45టీఎంసీలు కావాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి లేఖ రాశారని..అవి ఇంతకుముందే బచావత్ ట్రిబ్యూనల్ 45టీఎంసీలు కేటాయించిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఎంతసేపు రియల్ ఎస్టేట్, హిల్ట్ భూములు అమ్మడం, కమిషన్లు కొట్టడం తప్ప రాష్ట్రానికి నది జాలలపై మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వమని కేసీఆర్ విమర్శించారు. మన ఇంట్లకొచ్చి జేబుల చేయి పెట్టి డబ్బులు ఎత్తుకపోతామంటే ఊరుకోమని, బీజేపీపైన కూడా పోరాడుతామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు వెనుకబాటు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ప్రధానంగా చర్చించామని కేసీఆర్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది 308కిలోమీటర్లు పారుతున్నప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో ఆ జిల్లా వెనుకబడటానికి టీడీపీ, కాంగ్రెస్ లు కారణమన్నారు. ఆనాటి ప్రతిపాదిక ప్రాజెక్టుల లెక్కన ఆ జిల్లాకు 174టీఎంసీలు రావాల్సి ఉండేనన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో ఎక్కువగా నష్టపోయింది మహబూబ్ నగర్ జిల్లా అన్నారు. కృష్ణా జలాల్లో మన వాట కోసం ఉమ్మడి రాష్ట్రంలో, ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు సాగాయన్నారు. బచావత్ ట్రిబ్యునల్ పాలమూరు వెనుకబాటును చూడలేక 17టీఎంసీ జూరాల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నామని ప్రకటించారని కేసీఆర్ తెలిపారు. అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు జూరాలకు ఫౌండేషన్ వేయగా..నెమ్మదిగా ఓ బ్యారేజీ కట్టారన్నారు. దాని కింద ఆయకట్టు మాత్రం లేదన్నారు. 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా అదే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటానని చెప్పి అనేక ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేశారని, అవన్ని కలిపితే కృష్ణా నదిలో ఆనకట్ట ఏర్పాటు చేయవచ్చని చెప్పానన్నారు. పాలమూరు ప్రజలు ముంబైకి వలసలు పోయారనన్నారు.
నా ఒత్తిడితోనే చంద్రబాబు జూరాల కట్టారు
అప్పుడు చంద్రబాబు సమైక్య రాష్ట్రంలోనే పాలమూరు అభివృద్ది అని నినాదం తీసుకున్నారని, ప్రధమ మహాసభలో జూరాలకు సంబంధించి కర్ణాటకకు 13కోట్లు కట్టేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించాననన్నారు. మోకాళ్ల మీద పరుగెత్తి చంద్రబాబు కట్టాడని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆర్డీఎస్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే బాంబులు పెట్టి పేల్చాడని కేసీఆర్ తెలిపారు. ఆ తర్వాత రాయచూర్ లోని ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ చూసి జోగులాంబ గద్వాల పాదయాత్ర చేయగా..జూరాల లింక్ కెనాల్ తో చంద్రబాబు మరో డ్రామా వేశాడని, అయినా ఒక్క చుక్క నీరు పాలమూరుకు దక్కలేదన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగడం, రాష్ట్రం సాధించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ వెనుక బడ్డ ప్రాంతం కాదు వెనుకబడేసిన ప్రాంతమని తాను చెప్పానని, పాలమూరు జిల్లా వెనుక బాటుకు గంజి కేంద్రాలు పెట్డడం, ముంబై వలసలు కొనసాగడం నిదర్శనమని కేసీఆర్ తెలిపారు. ఆనాడు సీఎం చంద్రబాబు దత్తత లో ఉన్నా ఆ జిల్లా దుస్థితి మారలేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో ఆ జిల్లా ప్రాజెక్టులను తోసేశారన్నారు.
మేం వచ్చాక పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేశాం
రాష్ట్రం వచ్చాక నది జలాలపై సమగ్ర కసరత్తు చేసి..ప్రధమ ప్రాధాన్యత కింద పాలమూరు జిల్లాకు నీళ్లు ఇవ్వాలనకున్నామని.. తొలుత పెండింగ్ ప్రాజెక్టులు నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నికరంగా 6.50లక్షల ఎకరాలకు నీరందించామని కేసీఆర్ తెలిపారు. నెట్టెంపాడును 4టీఎంసీలు పెంచామన్నారు. మిషన్ కాకతీయలో ప్రాధాన్యతనిచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులను అభివృద్ది చేసి, వాగులపై చెక్ డ్యాంలు కట్టి మరో 1లక్షన్నర ఆయకట్టు తెచ్చామన్నారు. తదనంతరం కృష్ణా నది జలాలపై ఆధారపడిన రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ జిల్లాల కోసం నది జలాల వాటపై కేంద్రంతో కొట్లాడాలనుకున్నామన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 174టీఎంసీలు తీసుకోవాలనుకున్నామని, మొత్తం లెక్కలు తీసి కేంద్రానికి అందించి.. 90.81టీఎంసీలను కేటాయించామని, బచావత్ ట్రిబ్యూనల్ కేటాయించే నీళ్లు కూడా కలిపి 174టీఎంసీలు వస్తాయని భావించామన్నారు. పట్టిసీమ ఏపీ తీసుకునే 80టీఎంసీలు తీసుకుంటున్నందునా, ఈ మేరకు ఎగువ రాష్ట్రాలకు ఇస్తామని, కర్ణాటక 21, మహారాష్ట్రకు 14టీఎంసీలు, తెలంగాణకు 45టీఎంసీలు ఇస్తామని చెప్పిందని, ఇందులో 45టీఎంసీలతో కలిపి 90.81టీఎంసీలు కేటాయించామన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు 37వేల కోట్లు మంజూరు చేసి 27వేల కోట్లు ఖర్చు పెట్టామని, 80శాతం పనులు పూర్తి చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానది 300కిలోమీటర్లు పారే పాలమూరు జిల్లాలో 30వేల ఎకరాలను నీరందలేదన్నారు. ఏపీ జలదోపిడిని అధిగమించేందుకు పాలమూరుకు 145మెగావాట్స్ పంప్ లు పెట్టామన్నారు. వాటిలో ఓ పంప్ స్విచ్చాన్ చేశానన్నారు. ఈ ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ఆ తర్వాత అనుమతులు తీసుకోవాల్సి ఉందని, అప్పటికే 27వేలు ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామన్నారు. ఇంతలోనే మా ప్రభుత్వం మారిపోయిందన్నారు. ఇంత తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వ వచ్చినా నీళ్లు వచ్చే ప్రాజెక్టును కొనసాగిస్తారని కాంగ్రెస్ మాత్రం అలా చేయలేదని కేసీఆర్ విమర్శించారు.
చంద్రబాబు ఒత్తిడితోనే డీపీఆర్ వెనక్కి
రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిలో ఒక్క తట్టేడు మట్టి తీయలేదని కేసీఆర్ విమర్శించారు. మొదటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శనిగా మారిందని కేసీఆర్ విమర్శించారు. మేం అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడి 6 ఆనుమతులు సాధించామన్నారు. పర్యావరణ అనుమతి తెచ్చామన్నారు. ఇప్పుడు చంద్రబాబు, నితీష్ ల మద్దతు కోసం కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ లను వాపస్ పంపించదని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళన చేయలేదన్నారు. వడ్లు కొనకపోతే ఢిల్లీ మెడలు వంచే పోరాటం చేశామని, మూడు జిల్లాల ప్రాజెక్టు వాపస్ పంపిస్తే ప్రభుత్వం ఎలాంటి పోరాటం చేయకుండా మిన్నకుండిపోయిందన్నారు.
కృష్ణా జలాలను పున పంపిణీ చేయాలని మేం కొట్లాడామని, సుప్రీంకోర్టుకు వెళ్లామని అప్పటి కేంద్ర జలశక్తి మంత్రి స్పందించి సెక్షన్ 3 వేశారని, వాదనలు కొనసాగుతున్నాయన్నారు. బచావత్ లో 800టీఎంసీలలో బ్రిజేష్ ట్రిబ్యూనల్ లో 1000టీఎంసీలకు చేరిందని తెలిపారు. ట్రిబ్యూనల్ లో 90టీఎంసీలు మాకు ఉన్నాయని, 70టీఎంసీలు రావాల్సి ఉందన్నారు. పాలమూరు జిల్లాలో నియోజకవర్గానికొక లక్ష ఎకరాలు పారాల్సి ఉందని కేసీఆర్ తెలిపారు.
దొంగ హామీలతో అధికారంలోకి వచ్చారు
పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో సాగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో 20శాతం నేరాలు పెరిగిపోయాయని… అన్ని చూస్తూ వస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలలో మాకు ఓటేసే ఉద్దేశం ఉన్న ప్రజలను దొంగ హామీలతో అర్రాస్ పాటల మాదిరిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. రైతుబంధు పెంచుతామని, మహిళలకు 2,500ఇస్తాం, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాం, పెన్షన్ రూ4వేలు ఇస్తామని, 2లక్షల రుణమాఫీ చేస్తామని..420హామీలిచ్చారన్నారు. మేం సమ్మిళిత అభివృద్దితో అన్ని వర్గాలను కవర్ చేయాలని చూశామని, పేద విద్యార్ధులకు అంబేద్కర్ ఓవర్సీస్, జ్యూతిభా పూలే పథకాలతో రూ.25లక్షలు ఇచ్చామన్నారు. కేసీఆర్ కంటే అన్ని ఎక్కువే ఇస్తామని చెప్పి అందరికి శఠగోపం పెట్టారన్నారు.
రైతులను గోస పెడుతున్నారు
వడ్లు, పత్తి కూడా కొనడం లేదని.. యూరియా సరఫరా చేసే సత్తా కూడా ఈ ప్రభుత్వానికి లేదని.. మళ్లీ చెప్పుల లైన్లు వచ్చాయని, కొత్తగా యాప్ తెచ్చి మరిన్ని కష్టాల పాలు చేశారని కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ రైతు కేంద్రంగా పరిపాలన చేసిందని, కాంగ్రెస్ రెండు దఫాల రైతు బంధు ఎగవేసిందని, 4నెలల పెన్షన్ ఎగవేసిందని, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా, ఉద్యోగ క్యాలెండర్ వంటి ఎన్నో హామిలిచ్చి మోసంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాగానే రూ1000 పెన్షన్ ఇచ్చామని, రెండోసారి అధికారంలోకి వచ్చాక రూ.2వేలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ రూ4వేలు ఇస్తామంటే ఆ పార్టీకి ఓట్లేసి మోసపోయామని వాపోతున్నారన్నారు. ఇవ్వాళ ప్రజలు మళ్లీ కేసీఆర్ వస్తారని చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే చేస్తుంది
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా మాత్రమేనని కేసీఆర్ విమర్శించారు. ఐడీపీఎల్ రాకతో ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో విస్తరించాయని, ఈ నేపథ్యంలో ఫార్మాసిటీకి రూపకల్పన చేశామన్నారు. 14వేల ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. ఆ పక్కనే మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫార్మా సిటీ భూములను ఫ్యూచర్ సిటీ పేరుతో అమ్ముకునే దందాకు తెరతీసిందని ఆరోపించారు. హైదరాబాద్ నగరం అదే అభివృద్ది చెందిందని..ఫార్మాసిటీ ఎత్తివేసి నగరాన్ని గబ్బు పట్టించే పని చేస్తున్నారు. గురుకులల పిల్లలకు వసతులు లేవు గాని ఫ్యూచర్ సిటీ కడుతాడట అని విమర్శించారు. ఫార్మా సిటీ భూములను వేరే వాటికి ఇవ్వరాదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. కోర్టులో మాత్రం ఫార్మాసిటీ భూములను ఎవరికి ఇవ్వడం లేదని చెబుతారని.. అందుకు విరుద్దంగా వంతెరాకు కేటాయించడం, జూపార్కు మార్చి దాని భూములను అమ్మేయాలనుకోవడం ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో వారికే అర్ధం కావడం లేదన్నారు.
బోగస్ పెట్టుబడులతో కాంగ్రెస్ ప్రచారం
బిజినెస్ సమ్మిట్ పెట్టుకోవచ్చని దానిపై లక్షల కోట్లు పెట్టుబడులంటూ హైప్ చేసి చెప్పుకోవడం అడ్డగోలు జమాబందీగా ఉందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దీనికి చంద్రబాబు ఆద్యుడన్నారు. బోగస్ పెట్టుబడులతో కాంగ్రెస్ పాలకులు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మా ప్రభుత్వంలో సాఫ్ట్ వేర్ ఎగుమతులు 50వేల కోట్ల వరకు వెళ్లాయన్నారు. మేం కాంగ్రెస్ మాదిరిగా సమ్మిట్ లు, టెంట్లు వేయలేదన్నారు. ఫాల్కన్ కంపెనీ కోసం ప్రయత్నిస్తే మహారాష్ట్ర వేసుకపోయిందన్నారు. వరంగల్ మెగా పార్కులో హైటెక్స్ కంపెనీ తెచ్చామన్నారు.
భూముల ధరలు పడిపోయాయి..రియల్ ఎస్టేట్ ఢమాల్
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్నారని, ఉన్న రెవెన్యూ పడిపోయిందని, గ్రోత్ రేటు పడిపోయిందని కేసీఆర్ విమర్శించారు. సీఎంగా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చార్జీలు 4ఏళ్ల వరకు పెంచలేదన్నారు. మా పాలసీలతో స్కైలైన్ బిల్డింగ్ లు వచ్చాయన్నారు. నాలా ఫీజులు తొలగించామన్నారు. భూముల ధరలు మేం పెంచామని.. కాంగ్రెస్ వచ్చాక రియల్ ఎస్టేట్ గంగలో కలిసిపోయిందని, భూముల ధరలు పడిపోయాయన్నారు. దిక్కుమాలిన విధానాలతో అన్ని వర్గాలను వేధిస్తున్నారన్నారు. కేసీఆర్ అప్పులు చేశాడని దుష్ప్రచారం చేశారని.. కాగ్ 2లక్షల 90వేల కోట్లు అని చెంప చెల్లుమనిపించిందని తెలిపారు. నోరు తెరిస్తే కేసీఆర్ చావాలని విమర్శించడం పనిగా పెట్టుకుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఎంతదాకైన పోరాడుతామన్నారు. నా మీటింగ్ జరుతుంటే మంత్రి ఉత్తమ్ ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ ఎదో మాట్లాడేందుకు సిద్దమయ్యాడన్నారు. ఇంకా ఏదైనా నన్న అడుగాలనుకుంటే నేను రేపటి నుంచి మీడియాకు అందుబాటులో ఉంటానన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram