(BC Reservations| బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలంగాణ సర్కార్ ?

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది.

(BC Reservations| బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలంగాణ సర్కార్ ?

విధాత, హైదరాబాద్ : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో(Supreme Court) సవాల్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, (Telangana Government) సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది. హైకోర్టు స్టేపై ఏం చేయాలన్నదానిపై నేడు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మంత్రులు, న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయించనున్నారు. హైకోర్టు స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుందని తెలుస్తుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6శాతం ఉన్నందున 42% రిజర్వేషన్‌లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్‌ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.

బీసీ రిజర్వేషన్లపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పూర్తి వివరాలు శుక్రవారం అర్ధరాత్రి అందుబాటులో వచ్చాయి. ఉత్తర్వుల్లో రిజర్వేషన్లు 50శాతం దాటకుండా గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు పేర్కోనడం..పెంచిన 17శాతం సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని సూచించడం జరిగింది. హైకోర్టు సూచనల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై సీఎం రేవంత్ రెడ్డి న్యాయనిపుణులతో చర్చించి ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. హైకోర్టు తీర్పు కాపీ సోమవారంలోగా అందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అది రాకపోయినా.,. మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలున్నాయి.

మరోవైపు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చన్న ఉద్దేశంతో రిజర్వేషన్‌ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసిన వి.మాధవరెడ్డి, మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. రిజర్వేషన్‌లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే.. తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు.