BC Reservation| ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పోరుబాట

న్యూఢిల్లీ: 42శాతం బీసీ రిజర్వేషన్(BC Reservation) బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ధ ధర్నా(Jantar Mantar dharna) ప్రారంభించారు. పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఆధ్యక్షతన జరుగుతున్న ఈ ధర్నాలో పార్టీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), ఇండియా కూటమి(India alliance)నేతలు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నాకు అనుమతి లభించింది.
ధర్నాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మా హక్కు.. సాధించుకుని తీరుతామన్నారు. కేంద్రానికి కనువిప్పు కలిగేందుకే ఢిల్లీలో మహా ధర్నా చేపట్టామన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన రాష్ట్ర బీజేపీ నేతలు.. ఢిల్లీలో మాత్రం యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఎవరి ఒత్తిడితో యూ టర్న్ తీసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం బీసీ బిల్లును ఆమోదించకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పోరాటం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని..42 శాతం రిజర్వేషన్ తో ఉద్యోగస్థులు, విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో మాత్రం మోకాలు అడ్డుతోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో కాదు ఢిల్లీలో ధర్నా చేసి బీజేపీని ఒప్పించేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కవిత పొలిటికల్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. బీసీ బిల్లుకు ఆమోదం తెలిపే వరకు బీజేపీని విడిచి పెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించామని..అదే పద్ధతిలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడి సాధిస్తామని తెలిపారు. డీఎంకే ఎంపీ కనిమొళి ధర్నాకు హాజరై మద్దతు తెలిపారు.