Telangana Urea Shortage| యూరియా కోసం రైతన్నల ఆందోళనల పర్వం!

విధాత: తెలంగాణ(Telangana) వ్యాప్తంగా వానాకాలం పంటల సాగులో ఉన్న రైతాంగం యూరియా కొరత(Urea Shortage) తో అల్లాడుతున్నారు. రైతులు యూరియా(Farmers Protest) కోసం బారులు తీరడం..రోడ్లెక్కి రాస్తారోకోలు..ధర్నాలు చేయడం సాధారణంగా మారింది. గురువారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో తెల్లవారకముందే రైతులుయూరియా కోసం బారులు తీరిన దృశ్యం యూరియా కొరతకు నిదర్శనంగా నిలిచింది. మరోవైపు సిద్దిపేట జిల్లా రామాయంపేట రోడ్డుపై రైతులు ఉదయాన్నే రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) మరోసారి యూరియా కొరతపై ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మార్పు అంటే ఇదేనా సీఎం డౌన్ డౌన్.. సీఎం డౌన్ డౌన్ అంటూ రైతులు యూరియా కోసం సాగిస్తున్న ఆందోళనల ఫోటోలను ఆయన పోస్టు చేశారు.
అయితే యూరియా కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageshwar Rao) మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరుపునా చేయాల్సినవన్ని చేస్తున్నామని..కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన కోటా మేరకు యూరియా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన యూరియాలో ప్రతి నెలా కోతలు పెడుతూ.. 4 నెలల్లో 35% కొరత సృష్టించిందని మంత్రి తుమ్మల ఆరోపిస్తున్నారు. రాజకీయ స్వార్థంతో లక్షలాది మంది రైతుల జీవితాలతో ఆడుకుంటరా? అంటూ కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణపై ఇంకెన్నాళ్లీ వివక్ష.. ఎందుకీ సవతి ప్రేమ? అని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు సక్రమంగా సరఫరా జరుగుతున్నప్పుడు.. తెలంగాణకు మాత్రమే కోతలెందుకు? పెడుతున్నారని..తెలంగాణ రైతులంటే బీజేపీకి ఎందుకంత చిన్నచూపు? అని..మోదీ మొత్తం దేశానికి ప్రధానివా, లేక బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానివా ? అంటూ నిలదీశారు.