విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల టెండర్లలో రూ.2వేలు స్కామ్ కు పాల్పడిందంటూ బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సై అంటే సై అంటూ కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు మధ్య సాగిన సవాళ్ల పర్వంతో హైదరాబాద్ నగరం ఉద్రిక్తతలకు వేదికైంది. గురుకులాల అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తో చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, జూపల్లి కృష్ణరావులు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు
అమరవీరుల స్తూపం వద్దకు ఎవరైనా రండి…ఇక్కడే చర్చిద్దాం అన్నారు. లేదంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమని, బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం శాసన సభ్యులుగా ఉన్న మాజీ మంత్రులు ఎవరు చర్చకు వచ్చిన తాము సిద్ధమని ప్రకటించారు. జూపల్లి ఓ అడుగు ముందుకేసి తెలంగాణ భవన్ కు వస్తా..అక్కడే చర్చ పెడుదామంటూ సవాల్ చేశారు. అవినీతి నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్దమని, బీఆర్ఎస్ అప్పుల లెక్కలు నిరూపించలేకపోతే నేను రాజీనామాకు సిద్దం అంటూ మంత్రులు అడ్లూరి, జూపల్లి సవాల్ చేశారు.
మంత్రుల సవాళ్లకు ధీటుగా స్పందించిన మాజీ మంత్రి టి.హరీశ్ రావు సహా ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్కు వద్దకు బయలుదేరారు. అయితే పోలీసులు వారిని తెలంగాణ భవన్ నుంచి వెళ్లకుండా అక్కడే నిర్భంధించి అందరిని అదుపులోకి తీసుకుని కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట సాగింది. తోపులాటలో హరీశ్ రావు కిందపడిపోయారు. హరీశ్ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదే సమయంలో కేటీఆర్ మంత్రి జూపల్లి కోసం తెలంగాణ భవన్ లో ఓ కుర్చీ ఏర్పాటు చేసి చర్చకు ఎదురుచూశారు. అయితే జూపల్లి, ఇతర మంత్రులు గన్ పార్కు వద్ద ఉన్నారని తెలిసి కేటీఆర్ కు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వివాదానికి దిగారు. మంత్రులు రమ్మంటుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వాదించారు. చివరకు కేటీఆర్ మీడియాతో మాట్లాడి తిరిగి తెలంగాణ భవన్ లోకి వెళ్లిపోయారు.
సవాళ్లు చేసి పారిపోయారు: హరీశ్ రావు
ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ..రాత్రి పూట దొంగతనంగా గురుకులాల టెండర్లు పిలిచి గుజరాత్, బాంబే, ఢిల్లీకి చెందిన సేట్లకు వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టి
తెలంగాణ బిడ్డల నోట్లో మట్టికొట్టారని, రూ. 2 వేల కోట్ల స్కామ్ ను మేము ఆధారాలతో బయటపెడితే.. బహిరంగ చర్చకు రావాలని పిలిచిన కాంగ్రెస్ మంత్రులు చివరకు తోక ముడిచారంటూ ఎద్దేవా చేశారు. మేం ఆధారాలతో చర్చకు వస్తే.. వారి అవినీతి, స్కాములు బయటపడతాయనే భయంతో.. పోలీసులను అడ్డం పెట్టుకుని, గన్ పార్క్ వరకు వెళ్లకుండా అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. మీరు అవినీతి చేయకుంటే ఇంత భయమెందుకు? అని ప్రశ్నించారు. మీరే సవాల్ విసిరి మీరే చర్చకు పిలిస్తే మేం వస్తుండగా…. పోలీసులను పెట్టి ఆపడం ఎందుకని ప్రశ్నించారు.
ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని..ఇది వారికి పిరికితనానికి నిదర్శనం అని హరీశ్ రావు విమర్శించారు.
చర్చకు రమ్మన్నారు…పోలీసులతో అడ్డుకున్నారు : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ నాయకులతో బహిరంగ చర్చకు కూడా రాలేని కాంగ్రెస్ పిరికిపందలు, చేతకాని దద్దమ్మలు..చర్చలకు సిద్దమని సవాళ్లు ఎందుకు చేయాలంటు మండిపడ్డారు. చర్చకు రమ్మని సవాల్ చేసి..పోలీసులనతో అడ్డుకోవడం ఎందుకని నిలదీశారు. గతంలో రైతుల సమస్యలపై ప్రెస్ క్లబ్‌లో చర్చిద్దాం రమ్మని ముఖ్యమంత్రి సవాల్ విసిరితే, మేమంతా పూర్తి వివరాలతో అక్కడికి వెళ్లాం. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి మొహం చాటేసి పారిపోయారు. ఇప్పుడు మళ్లీ అప్పుల విషయంలో చర్చకు రమ్మంటూ పేరు పేరునా సవాల్ చేశారు. ‘సరే, మేము సిద్ధం… అసెంబ్లీకా? సెక్రటేరియట్ కా? అశోక్ నగర్ చౌరస్తాకా? లేదా వరంగల్ కా? ఎక్కడికి రమ్మంటారో చెప్పండి’ అని మేము స్పష్టం చేస్తే, సవాల్ విసిరిన ముఖ్యమంత్రి నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, తోకముడిచి పారిపోయారు! ఈ సందులో మంత్రి జూపల్లి కృష్ణారావు ‘రేపు పొద్దున 11 గంటలకే తెలంగాణ భవన్‌కు వస్తున్నా, మీ ఆఫీస్‌కే వస్తున్నా’ అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. సరే అని మేమంతా ఉదయం 10 గంటలకే వచ్చి శాలువాతో స్వాగతం పలకడానికి సిద్ధంగా కూర్చున్నాం. కానీ ఆయనా రాలేదు, మొహం చాటేశారన్నారు. గన్ పార్కు వద్దకు రమ్మన్న జూపల్లి ఆహ్వానం మేరకు నేను అక్కడి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుపడ్డారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో అభివృద్ది, అవినీతి, అప్పులపై చర్చ పెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు.
రెండు గంటలు వేచి చూశాం..రాలేదు : మంత్రులు
గురుకులాల అవినీతిపై చర్చకు బీఆర్ఎస్ నాయకుల కోసం తాము గన్ పార్కు వద్ద రెండు గంటలు ఎదురుచూశామని, హరీశ్ రావు, కేటీఆర్ ఎవరూ రాలేదని..అబద్దపు అరోపణలు చేయడం, తప్పించుకోవడం వారికి అలవాటుగా మారిందంటూ మంత్రులు జూపల్లి, అడ్లూరి, పొన్నం, అజారుద్ధీన్ లు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7లక్షల 30 వేల కోట్ల అప్పులు చేశారని…
కచ్చితంగా నిరూపిస్తానని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అమరవీరుల స్తూపం వద్దకు ఎవరైనా రండని జూపల్లి చెప్పారు. చివరకు ఎవరు రాలేదంటూ జూపల్లి విమర్శించారు.
