హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్ హైటెక్స్‌లో ‘థ్రెడ్ పోచంపల్లి’ ప్రదర్శన ప్రారంభమైంది. 100కు పైగా స్టాల్స్‌లో అసలైన పోచంపల్లి ఇక్కత్ చీరలు, చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

Reported by: Tejaswini Nanna | Latest News | Jun 05, 2026, 3:27 pm IST
Read Time: 4 mins
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో చేనేత కళకు అండగా నిర్వహించనున్న మూడు రోజుల ‘థ్రెడ్ పోచంపల్లి’ (Thread Pochampally) ప్రదర్శనను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పోచంపల్లి ఇక్కత్ సాంప్రదాయ చేనేత కళను సంరక్షించడం, మన నేతన్నలకు అండగా నిలవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. దళారీల ప్రమేయం లేకుండా, నకిలీలకు తావులేకుండా వందకు పైగా చేనేత కుటుంబాలు నేరుగా తమ అసలైన ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తున్నాయని వెల్లడించారు. మగ్గాలపై వస్త్రాలను ఎలా నేస్తారో ప్రత్యక్షంగా చూపే లైవ్ లూమ్ డెమోన్స్ట్రేషన్స్ ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయని పేర్కొన్నారు. మన సంస్కృతిని కాపాడుతూ నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ అద్భుతమైన ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సందర్శించి, విజయవంతం చేయాలని కోరుతున్నానన్నారు.

‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనలో 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. చేనేత కళాకారుల ఆధ్వర్యంలో 75స్టాల్స్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో 25 స్టాల్స్ ఏర్పాటు చేశారు. గ్రామీణ చేనేత కార్మికులు,పట్టణ వినియోగదారుల మధ్య వారధిగా ఈ ప్రదర్శన ఉపయోగపడనుంది. రూ.80లక్షల సీఎస్ఆర్ నిధులతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశఆారు. పోచంపల్లి చేనేత చీరలు, వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు నేరుగా చేనేత కార్మికులు, తయారీ దారుల నుంచే విక్రయించబడుతాయి. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, పట్టు, కాటన్ చీరలు, పుట్టపాక తేలియా రూమాలు, దుప్పట్లు, షర్ట్, ఫ్యాంట్ క్లాత్ లు, శాలువలు, పోచంపల్లి డ్రస్ మెటీరియల్ తదితర వస్త్రాలు ప్రదర్శనలో లభిస్తాయి. ప్రదర్శనలో యాదాద్రి భువనగిరి జిల్లా సంప్రదాయ వస్త్రాలు, హస్తకళలు, వంటకాల రుచులు సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు.

‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శన ప్రారంభోత్సవంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహిత చింతకింద మల్లేశం, గజం గోవర్థన్, గజం అంజయ్య, వివిధ జిల్లా, రాష్ట్ర చేనేత కళాకారులు పాల్గొన్నారు.