Tornado । మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం.. 50వేలకు పైగా చెట్లు నేలమట్టం
భారీ వృక్షాలు కూడా నేలకు ఒరగడాన్ని బట్టి కనీసం గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చి ఉంటాయని తెలిపారు. అయితే.. 50 వేలకు పైగా చెట్లు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

Tornado । మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో భారీ వృక్షాలు నేలమట్టం అయ్యాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలిదుమారం, సుడిగాలులు బీభత్సం సృష్టించడంతో మహావృక్షాలు నేలకొరిగాయి. ఒకే చోట మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో 50 వేలకు పైగా చెట్లు నేలమట్టం అయ్యాయి.
టోర్నడోల తరహాలో సుడిగాలులు..
ఈ నెల 1వ తేదీన పరిశీలనకు వెళ్లిన అధికారులు సుడిగాలి బీభత్సానికి చెట్లు కూలడం చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. టోర్నడోల కారణంగానే ఈ చెట్లు కూలి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వృక్షాలు కూడా నేలకు ఒరగడాన్ని బట్టి కనీసం గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చి ఉంటాయని తెలిపారు. అయితే.. 50 వేలకు పైగా చెట్లు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నెలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా
ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నెలకొరగడంపై మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆరా తీశారు. సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓలతో టెలిఫోన్‌లో మాట్లాడారు. చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సీతక్క రెండు రోజుల క్రితమే సందర్శించారు. భారీ సంఖ్యలో చెట్లు నేల కూలడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ‘ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నెలకొరిగాయి. వందల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించాం. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశాం’ అని ఆమె తెలిపారు. అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని చెప్పారు. సమక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదన్నారు. చెట్లు నెలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీతక్క కోరారు. కేంద్రం నుంచి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అటవి ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేయాలని కోరారు.