Rwanda | వంట‌గ‌దిలో గుంత‌.. అందులో శ‌వాల గుట్ట‌! సీరియ‌ల్ కిల్ల‌ర్ అరెస్టు

Rwanda | రువాండాలో ఒక న‌ర‌రూప రాక్ష‌సుడు పోలీసుల చేతికి చిక్కాడు. ఓ నేరంలో ప‌ట్టుబ‌డిన అత‌డిపై కేసు న‌మోదు చేసిన పోలీసుల‌కు అత‌డి ఇంటిని ప‌రీక్షించిన‌పుడు దిగ్భ్రాంతిక‌ర విష‌యాలు తెలిశాయి. వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కిగాలి ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల నిందితుణ్ని (Serial Killer) తొలుత అత్యాచారం, దోపిడీ త‌దిత‌ర అంశాల‌పై పోలీసులు గ‌తంలో అరెస్టు చేశారు. అయితే త‌గిన‌న్ని సాక్ష్యాధారాలు లేక‌పోవ‌డంతో కోర్టు కేసులు కొట్టేసి బెయిల్ మంజూరు చేసింది. అయినా […]

Rwanda | వంట‌గ‌దిలో గుంత‌.. అందులో శ‌వాల గుట్ట‌! సీరియ‌ల్ కిల్ల‌ర్ అరెస్టు

Rwanda |

రువాండాలో ఒక న‌ర‌రూప రాక్ష‌సుడు పోలీసుల చేతికి చిక్కాడు. ఓ నేరంలో ప‌ట్టుబ‌డిన అత‌డిపై కేసు న‌మోదు చేసిన పోలీసుల‌కు అత‌డి ఇంటిని ప‌రీక్షించిన‌పుడు దిగ్భ్రాంతిక‌ర విష‌యాలు తెలిశాయి. వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కిగాలి ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల నిందితుణ్ని (Serial Killer) తొలుత అత్యాచారం, దోపిడీ త‌దిత‌ర అంశాల‌పై పోలీసులు గ‌తంలో అరెస్టు చేశారు.

అయితే త‌గిన‌న్ని సాక్ష్యాధారాలు లేక‌పోవ‌డంతో కోర్టు కేసులు కొట్టేసి బెయిల్ మంజూరు చేసింది. అయినా పోలీసుల‌కు అత‌డిపై అనుమానం తీర‌క‌పోవ‌డంతో.. మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు ప్రారంభించారు. దీంతో మ‌రోసారి అత‌డిపై ఆరోప‌ణ‌లు న‌మోదు చేసి మంగ‌ళ‌వారం అరెస్టు చేశారు. అనంత‌రం అత‌డి ఇంటిని సోదా చేయ‌గా.. వంటింట్లో గొయ్య తీసి పూడ్చిన‌ట్లు వారికి క‌నిపించింది.

దానిని త‌వ్వి చూడ‌గా.. ఎలా ప‌డితే అలా న‌రికేసిన మాన‌వ అవ‌శేషాల‌ను క‌నుగొన్నారు. క‌నీసంలో కనీసం 10 మంది మృత‌దేహాలు క‌నుగొన్నామ‌ని.. ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల త‌ర్వాత మాత్ర‌మే అస‌లు సంఖ్య తెలుస్తుంద‌ని పోలీసులు తెలిపారు. దీంతో అత‌డిని సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా భావించి కొత్త కేసులు న‌మోదు చేశారు. ఈ ద‌ర్యాప్తులో పోలీసుల‌కు విస్తుపోయే విష‌యాలు తెలిశాయి.

మ‌నుషుల్ని క్రూరంగా చంప‌డాన్ని నిందితుడు వెబ్ సిరీస్‌ల‌ను చూసి నేర్చుకున్నాడు. కొంత‌మంది మ‌నుషుల్ని అత‌డు స‌జీవంగా యాసిడ్‌లో ముంచి న‌ర‌కం చూపించేవాడ‌ని తెలుస్తోంది. వీటిని నిందితుడు సైతం ఒప్పుకొన్న‌ట్లు సమాచారం. నిందితుడు తాను చంపాల‌నుకునే వాళ్ల‌ను ఎంపిక చేసుకోవ‌డానికి అధ్య‌య‌నం చేసేవాడు. కుటుంబానికి, స్నేహితుల‌కు దూరంగా.. లేదా తాము వెలివేయ‌బ‌డ్డామ‌ని భావించే వాళ్ల‌ను ఎంచుకుని ప్రాణాలు తీసేవాడని సంబంధిత అధికారి ఒక‌రు వివ‌రించారు.