ఢిల్లీలో పగటిపూట చిమ్మ చీకట్లు.. దట్టంగా కమ్మేసిన పొగమంచు
ఉత్తర భారతాన్ని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేడంతో దాదాపు ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. దృశ్యమానత కేవలం 50 మీటర్లకు పడిపోయింది

- 110 విమానాలు, 25 రైలు సర్వీసులు ఆలస్యం
- దేశ రాజధానిలో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ
- ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై పలు వాహనాలు ఢీ
- ఒకరు దుర్మరణం.. మరో 12 మందికి గాయాలు
విధాత: ఉత్తర భారతాన్ని బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేడంతో దాదాపు ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. దృశ్యమానత కేవలం 50 మీటర్లకు పడిపోయింది. పొగమంచు ప్రభావం విమాన, రైలు ప్రయాణాలపై పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో 110 విమానాల సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఢిల్లీకి వెళ్లే 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే తెలిపింది. దేశ రాజధానిలో “అతి దట్టమైన పొగమంచు” కారణంగా వాతావరణ కార్యాలయం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రహదారులపై కూడా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. రహదారులపై పొగమంచు కమ్ముకోవడంతో ఉత్తరప్రదేశ్ అంతటా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై పలు వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో 12 మంది వరకు గాయపడ్డారు. బరేలీలో, బరేలీ-సుల్తాన్‌పూర్ హైవే సమీపంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఇంటిపైకి దూసుకెళ్లింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో “దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు పరిస్థితులు” ఉన్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని పాలమ్ అబ్జర్వేటరీలో 125 మీటర్ల విజిబిలిటీ నమోదైంది. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో అది కేవలం 50 మీటర్లకు పడిపోయింది. దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికులకు 50 మీటర్లదూరంలో ఏమున్నదో కనిపించలేదు. పాటియాలా, లక్నో, ప్రయాగ్‌రాజ్‌లలో 25 మీటర్ల విజిబిలిటీ చాలా తక్కువగా నమోదైంది. అమృత్‌సర్‌లో అది 0 మీటర్లకు పడిపోయింది.