విధాత: మహారాష్ట్ర జైళ్లు అండర్ ట్రయల్స్, ఖైదీలకు విద్యను అందిస్తున్నాయి. వారిలో నేరప్రవృత్తిని మార్చేందుకు ఈ చర్యలు చేపట్టాయి. డిగ్రీలు పూర్తిచేసిన ఖైదీలకు శిక్షలో రాయితీ కల్పిస్తున్నాయి. అర్హులైన ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తున్నాయి. ఇలా 2019 నుంచి జూన్ 2023 వరకు 145 మంది ఖైదీలు విడుదలయ్యారు.
మహారాష్ట్రలోని 10 జైళ్లలో అండర్ ట్రయల్స్, ఖైదీలకు ఎస్ఎస్‌సీ/ హెచ్ ఎస్‌సీ (SSC/HSC), గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నారు. ఈ కోర్సులను సులభంగా పూర్తి చేసేందుకు ఖైదీలకు స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU), యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ (YCMOU) అందించే కోర్సుల్లో ఖైదీలు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.
ఖైదీలకు కోర్స్ మెటీరియల్స్ ఇస్తారు. చదువుకోవడానికి, సందేహాల నివృత్తి, పాఠ్యాంశాల బోధనకు జైలులో నియమితులైన ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారు. జైలులోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తున్నారు.
హత్య కేసులో నాగ్‌పూర్ జైలులో శిక్షను అనుభవిస్తూ ఓ మహిళ ఇటీవల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసింది. డిగ్రీ ఆమె శిక్షను మూడు నెలలు తగ్గిస్తుంది. హత్యకు పాల్పడిన ఆమె భర్త కూడా ఇప్పటికే విడుదలయ్యాడు.
నాగ్‌పూర్ సెంట్రల్ జైలు 2019-జూన్ 2023 మధ్యకాలంలో 61 మంది ఖైదీలు ఇలా విద్యాభ్యాసం పూర్తిచేసి విడుదలయ్యారు. 2019- 2023 మధ్యకాలంలో శిక్షల్లో తగ్గింపులు పొంది 145 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇందులో హంతకులు ఉన్నారు. దొంగలు ఉన్నారు.
ఖైదీలు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించి విడుదలైన తర్వాత సమాజంలో మళ్లీ కలిసిపోయేందుకు మంచి అవకాశం కల్పించేందుకు ఈ మినహాయింపును అందించినట్టు జైళ్ల అదనపు డైరెక్టర్ జనరల్ అమితాబ్ గుప్తా తెలిపారు.