Site icon vidhaatha

Rajasthan | మైనర్ అక్కాచెల్లెలుపై గ్యాంగ్‌రేప్‌.. గ‌ర్భందాల్చిన 13, 15 ఏండ్ల బాలికలు

Rajasthan |

విధాత‌: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఇటుక బట్టీలో ప‌నిచేసే ఇద్దరు టీనేజీ అక్కా చెల్లెలుపై వారితోపాటు ప‌నిచేసే ఇద్ద‌రు క‌మాంధులు లైంగికదాడికి పాల్ప‌డ్డారు. విష‌యాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామ‌ని బెదిరించి ప‌లుమార్లు కామ‌వాంఛ తీర్చుకున్నారు. అక్క‌, చెల్లిపై ప‌లుమార్లు లైంగిక‌దాడికి పాల్ప‌డ‌టంతో వారు గ‌ర్భం దాల్చారు.

15 ఏండ్ల‌కు అక్క‌కు ఇటీవ‌ల క‌డుపునొప్పి అధికం కావ‌డంతో ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు. అక్క‌డ వైద్యులు ప‌రీక్షించి బాలిక ఏడున్న‌ర నెల‌ల గ‌ర్భ‌వ‌తిగా తేల్చారు. ఈ ఘ‌ట‌న‌పై తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా, సప్పి, సుభాన్ తనపై లైంగిక‌ దాడి చేశారని బాలిక చెప్పింది. వారు తన చెల్లెలుపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె వెల్లడించింది.

13 ఏండ్ల చెల్లికి కూడా ప‌రీక్ష చేయ‌గా రెండున్నర నెలల గర్భిణిగా నిర్ధారించారు. ఈ ఘటనపై బాధిత బాలికల తండ్రి ఎన్‌ఈబీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో బాలికలిద్దరూ గర్భవతులని తేలింది. బాధితురాలి తండ్రి పనిచేసే ఇటుక బట్టీ సమీపంలోనే కుటుంబం నివసిస్తున్న‌ద‌ని పోలీసులు తెలిపారు.

స్కూల్ విద్యార్థినిపై లైంగిక‌దాడి

ఇదే జిల్లాలోని బన్సూర్ ప్రాంతంలో ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. విద్యార్థిని స్కూల్‌కు వెళ్తున్న‌ప్పుడు ఇద్దరు నిందితులు త‌న‌ను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. నిందితులు ఈ ఘటనను వీడియో తీసి ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించిన‌ట్టు బాధిరాలు పేర్కొన్న‌ది. జూలై 27న జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదైంది.

Exit mobile version