Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరదకు గురైన వరంగల్ నగరానికి తక్షణ సహాయం రూ. 250 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. హనుమకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రూ. వెయ్యి కోట్ల వరకు ఎస్టిమేషన్స్ పంపించామని చెప్పారు. దీనికి ప్రభుత్వం తక్షణ సహాయం కేటాయించిందన్నారు. ఏడాదిలో కురిసేటువంటి వర్షపాతం ఒకే రోజున 275 మిల్లీమీటర్లు నమోదైందని తెలిపారు. సమ్మయ్య నగర్, రామ్ నగర్, జవహర్ నగర్ తదితర కాలనీలు నీట మునిగాయన్నారు.
వరద ఉధృతికి లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. 2020లో నూ మంత్రి కేటీఆర్ వరద సాయంగా రూ.120 కోట్లు కేటాయించి, నగర అభివృద్ధికి తోడ్పడ్డారని గుర్తుచేశారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. నాళాలను పూర్తిగా తొలగించే దిశగా అధికారులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేక ముంపు ప్రాంతాలను సందర్శించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు, ఇక్కడ రాదు.. అక్కడ రాదు అని ఎద్దేవా చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనులకు అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.
బీజేపీ నేతల తప్పుడు విమర్శలు
బీజేపీ నాయకులు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ మండిపడ్డారు. వరంగల్ నగరానికి అన్ని రకాల అభివృద్ధి కోసం ఎన్నో నిధులను ప్రభుత్వం ఇస్తున్నదని తెలిపారు. అనంతరం కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, కార్పొరేటర్లు అశోక్ యాదవ్, రంజిత్ రావు,నాయకులు శివశంకర్ పాల్గొన్నారు.