విహారయాత్ర విషాదాంతం.. టూరిస్టు బ‌స్సు లారీ ఢీ

ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ విద్యార్థులంద‌రూ బ‌స్సులో విహార‌యాత్ర‌కు బ‌య‌లుదేరారు. విద్యార్థులు పాటలు పాడుకుంటూ, ఆంత్యాక్ష‌రి ఆడుకుంటూ, కేరింత‌లు కొడుతున్నారు

  • Publish Date - January 27, 2024 / 09:05 AM IST

ముగ్గురు విద్యార్థినులు మృతి

మ‌రో 10 మందికి గాయాలు.. ఒడిశాలో ఘ‌ట‌న‌


విధాత‌: ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ విద్యార్థులంద‌రూ బ‌స్సులో విహార‌యాత్ర‌కు బ‌య‌లుదేరారు. విద్యార్థులు పాటలు పాడుకుంటూ, ఆంత్యాక్ష‌రి ఆడుకుంటూ, కేరింత‌లు కొడుతున్నారు. బ‌స్సు వేగంగా ర‌హ‌దారిపై వేగంగా దూసుకెళ్తున్న‌ది. ఒక్క‌సారిగా ధ‌డేల్‌మ‌ని శ‌బ్దం. బ‌స్సు-లారీ ఎదురెదురుగా బ‌లంగా ఢీకొన్నాయి. విద్యార్థులు చెల్లాచెదురుగా ప‌డ్డారు. విద్యార్థుల హాహాకారాలు, భ‌యాందోళ‌న‌లు. తీవ్ర గాయాల‌తో బ‌స్సు ర‌క్త‌సిక్తంగా మారింది. ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మ‌రో 10 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం..


ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థులతో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ముగ్గురు బాలికలు మరణించారు. మరో 10 మంది గాయపడినట్టు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం 50 మంది విద్యార్థులతో బస్సు బోలంగీర్ జిల్లాకు విహారయాత్రకు వెళ్తుండగా, దస్పల్లా ప్రాంతంలోని సహలభంగ జంగిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.


ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో బాలికను ద‌వాఖాన‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. గాయపడిన విద్యార్థులు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టి ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.