PM Modi Manipur Visit | శనివారం మణిపూర్ పర్యటనకు ప్రధాని మోదీ: ధృవీకరించిన రాష్ట్ర సీఎస్
జాతుల ఘర్షణతో మండిపోతున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం (13-09-2025) పర్యటించనున్నారని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.
PM Modi Manipur Visit | తెగల ఘర్షణలతో 2023 మే నెల నుంచీ హింసాత్మక ఘటనలతో రగిలిపోతున్న మణిపూర్‌లో పర్యటించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఎట్టకేలకు సిద్ధమయ్యారు. మణిపూర్ పర్యటనకు ప్రధాని శనివారం వస్తున్నారని ఆ రాష్ట్ర సీఎస్ పునీత్ కుమార్ గోయెల్ శుక్రవారం మధ్యాహ్నం ధృవీకరించారు. ప్రధాని పర్యటన కోసం గత కొన్ని రోజులుగా జోరుగా ఏర్పాటు జరుగుతున్నాయి. మోదీ ఈ పర్యటన సందర్భంగా సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారితో మాట్లాడనున్నారు. ప్రధాని పర్యటన కోసం ఇంఫాల్, చురాచాంద్‌పూర్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం రాత్రి రాజధాని నగరంలోని పలు ప్రాంతాల్లో మోదీనికి స్వాగతిస్తూ పోస్టర్లు కూడా వెలిశాయి.
ఐజ్వాల్ నుంచి కుకి జో మెజార్టీ ఉన్న ప్రాంతమైన చురాచాంద్‌పూర్‌లో మోదీ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ల్యాండ్ అవుతారని చీఫ్ సెక్రటరీ గోయెల్ తెలిపారు. అల్లర్లతో నిరాశ్రయులైన ప్రజలతో తొలుత మోదీ మాట్లాడుతారని ఆయన చెప్పారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం ఇంఫాల్‌కు వెళ్లి, అక్కడ నిరాశ్రయులతో మాట్లాడనున్నారు. అక్కడ కూడా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 7,300 కోట్లు, 1,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని సీఎస్ గోయెల్ తెలిపారు.
మైతేయి, కుకి జో తెగల మధ్య గడిచిన 27 నెలలుగా మణిపూర్ తీవ్ర హింసాత్మక ఘటనలతో అట్టుడికి పోతున్నది. శాంతి భద్రతలు క్షీణించడంతో రెండు తెగలకు చెందిన వేల మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 280 సహాయ శిబిరాల్లో 57వేల మందికిపైగా ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని సహాయ శిబిరాలను ఎత్తివేసేలా భారీ పునరావాస ప్రాజెక్టును జూలై నెలలో అప్పటి రాష్ర్ట ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ పీకే సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సహాయ శిబిరాల్లో ఉన్నవారందరికీ ఆయా ప్రాజెక్టుల్లో శాశ్వత నివాసాలు కల్పించనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram