కేరళలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
కేరళలోని మంచేరిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న టెంపోను ఆటో ఢీకొట్టింది

తిరువనంతపురం: కేరళలోని మంచేరిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న టెంపోను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఆటో డ్రైవర్ అబ్దుల్ మజీద్(50) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో బయల్దేరాడు.
మంచేరి సమీపంలో అదుపుతప్పిన ఆటో.. టెంపోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మజీద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులను తస్లీమా(34), ముహ్‌సీనా(32), ఫాతిమా(4), రిన్షా(7)గా పోలీసులు గుర్తించారు. ఇక టెంపోలో ప్రయాణిస్తున్న అయ్యప్ప భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. అయ్యప్ప భక్తులు కర్ణాటక నుంచి శబరిమల వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.