Uttarakhand | విధాత: ఉత్తరాఖండ్‌లో భక్తులతో వెళ్తున్న బస్సులో లోయలో పడిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గంగోత్రి నుంచి తిరిగి వస్తుండగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం సంభవించింది.
భట్వాడి తహసీల్‌లోని రిషికేశ్-గంగోత్రి జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరంతా గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాకు చెందిన వారు. ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్‌లో ఆక్షాంక్షించారు.