13 ఏండ్ల బాలికను నగ్నంగా చిత్రీకరించి వేధింపులు
ఆ బాలిక వయసు 13 ఏండ్లు. పొట్ట నింపుకునేందుకు, కుటుంబానికి అండగా నిలిచేందుకు ఓ ఇంట్లో పని మనిషిగా కుదిరింది

న్యూఢిల్లీ : ఆ బాలిక వయసు 13 ఏండ్లు. పొట్ట నింపుకునేందుకు, కుటుంబానికి అండగా నిలిచేందుకు ఓ ఇంట్లో పని మనిషిగా కుదిరింది. ఇక తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న ఆ బాలికకు యజమానురాలు డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేసింది. యజమానురాలి కుమారులిద్దరూ బాలికను లైంగికంగా వేధించారు. బట్టలు విడిపించి, వీడియోలు చిత్రీకరించారు. తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన గుర్గావ్‌లోని సెక్టార్ 57లో వెలుగు చూసింది.
బీహార్‌కు చెందిన ఒక మహిళ తన కూతురితో కలిసి బతుకుదెరువు కోసం గుర్గావ్‌కు చేరుకుంది. ఇక తనకు తెలిసిన వ్యక్తి ద్వారా సెక్టార్ 57లోని ఓ ఇంట్లో తన 13 ఏండ్ల బాలికను పనికి పెట్టింది. నెలకు రూ. 9 వేలు ఇస్తానని ఆ ఇంటి యజమానురాలు బాలిక తల్లికి చెప్పింది. మొదటి రెండు నెలలు జీతం సరిగ్గానే ఇచ్చింది.
ఆ తర్వాత బాలికకు వేధింపులు ప్రారంభమయ్యాయి. బాలికను తరుచూ ఇనుపరాడ్లతో కొట్టడం, కుక్కతో కరిపించడం జరిగాయి. అంతటితో ఆగకుండా యజమానురాలు కుమారులిద్దరూ బాలికను ఓ గదిలో బంధించి, బట్టలు విడిపించారు. నగ్నంగా చేసి వీడియోలు చిత్రీకరించారు. తాకరాని చోట తాకి బాలికను హింసించారు.
తన బిడ్డ బాగోగులు తెలుసుకునేందుకు తల్లి అక్కడికి వెళ్లేది. కానీ ఆ ఇంటి యజమానురాలు బాలికను కలిసేందుకు అనుమతించకపోయేది. ఫోన్ చేసినా కూడా స్పందించకపోయేది యజమానురాలు. దీంతో తల్లే ఆ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో బాలికను ఓ గదిలో నిర్బంధించి, ఆమె మూతికి టేప్ వేసి ఉంచినట్లు గుర్తించారు.
బాలికను అక్కడ్నుంచి తీసుకొని నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది తల్లి. తన బిడ్డను ఘోరంగా హింసించారని, 48 గంటలకు ఒకసారి భోజనం పెట్టారని ఫిర్యాదులో పేర్కొంది. చేతులపై యాసిడ్ పోసి వేధించారని తెలిపింది. ఈ విషయాలు బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు వివరించింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.