వర్షంలో అడవి బిడ్డల అరిగోస.. వాగు ఒడ్డున గిరిజన మహిళకు ప్రసవం

వర్షంలో అడవి బిడ్డల అరిగోస.. వాగు ఒడ్డున గిరిజన మహిళకు ప్రసవం
  • వాగు ఉధృతితో గ్రామానికి చేరని అంబులెన్స్
  • వాగు ఒడ్డున గిరిజన మహిళకు ప్రసవం
  • కాలి నడకన వెళ్లి పురుడు పోసిన 108 సిబ్బంది

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ కు ఫోన్ చేస్తే వర్షాకాలంలో అంబులెన్స్ గ్రామానికి వచ్చే దారి లేక నానా అవస్థలు పడుతూ వాగు ఒడ్డుపైనే ఆదివాసీ మహిళలు పురుడు పోసుకొని పండంటి బిడ్డలకు జన్మనిస్తున్నారు. పాలకులు చెబుతున్న మాటలకు ఆదివాసీ గూడెంలలో సదుపాయాలకు ఎక్కడ పొంతన ఉండడం లేదని గిరిజన తండాల ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

వాన కాలంలో అయితే అడవి బిడ్డల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. తాజాగా అదే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం చిన్నుగూడ గ్రామానికి చెందిన ఆత్రం భీం బాయికి ఎదురైంది. అంబులెన్స్ సిబ్బంది ఔదార్యం, తెగువతో ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం చిన్నుగూడ గ్రామానికి చెంచిన ఆత్రం భీంబాయి అనే గిరిజన గర్భిణి మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్ళెందుకు 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది చిన్నుగూడ గ్రామానికి బయలు దేరినప్పటికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో భీంగూడ సమీపం వరకు వచ్చారు.

మరోవైపు వర్షం కారణంగా చిన్నుగూడ గ్రామానికి అడ్డంగా ఉన్నా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఒకపక్క వర్షం, మరోపక్క వాగు ఉధృతి.. అయినప్పటికి ఈ పరిస్థితిలో 108 సిబ్బంది రెండు కిలోమీటర్ల దూరం వరకు కాలి నడకన వాగు దాటి గర్భిణి మహిళ వద్దకు చేరుకున్నారు. వాగు ఒడ్డు వరకు చేరుకున్న ఆ గర్భిణి మహిళకు పురిటి నొప్పులు అధికం కావటంతో ఆమె వెంట వచ్చిన ఒకరిద్దరు మహిళల సహకారంతో వర్షంలోనే గొడుగులు పట్టుకొని గిరిజన మహిళకు పురుడు పోశారు.

108 వాహనం ఈఎంటి శంకర్, పైలట్ సచిన్ లు అన్నీ తామై వ్యవహరించారు. అనంతరం తల్లీ, బిడ్డను స్ట్రెచర్‌ పై ఎత్తుకొని వాగు దాటించి అంబులెన్స్ ఎక్కించి ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసవ వేదన నుండి గిరిజన మహిళను కాపాడిన 108 సిబ్బందిని గ్రామస్థులు అభినందించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి.

వర్షాకాలంలో గ్రామాలకు గ్రామాలే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి వారాల తరబడి ఒంటరిగా ఊరిలోనే గడపవలసి వస్తుంది . ఏదైనా ఎమర్జెన్సీ ఆరోగ్య సమస్యలు తలెత్తితే అంతే సంగతులు పట్టణానికి వెళ్లాలంటే ఊళ్ళ మధ్యలో ఉన్న వాగులు ఉదృతంగా ప్రవహించడంతో వాగులు దాటి వెళ్లే అవకాశం లేక ఆకు పసరు మందుల పైనే ఆధారపడి జీవనం గడుపుతారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటివి పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి.

సరైన రోడ్డు సౌకర్యం లేక రాళ్లు, గుంతలతో కూడిన అటవీ మార్గంలో ఎడ్ల బండి పై ఓ మహిళ ప్రసవించగా, మరో గిరిజన మహిళ కూడా ఇలా వాగు ఒడ్డునే ప్రసవించింది. కాగా వానాకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గూడాల ప్రజలు అత్యవసర సమయంలో వైద్యం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేక, వాగులపై వంతెనలు లేక అవస్థల పాలవుతున్నారు.

గర్భిణిలు, బాలింతలు, ఇతర రోగులు ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇలాగే తిప్పలు పడుతున్నారు. తండ్రులు బాహుబలిలో సన్నివేశంలాగా తమ పిల్లలను చేతులపై ఎత్తుకొని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి ఆసుపత్రికి చేరిన సంఘటనలు కూడా జరిగాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు, వంతెనల సౌకర్యం కల్పించి ఆదివాసీ గిరిజనుల కష్టాలను తొలగించాలని కోరుతున్నారు.