విధాత బ్యూరో, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో BRS అసంతృప్తినేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి మరో అసంతృప్తి నేత నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హాజరవుతుండడం ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి రగిలించింది.
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి BRSతో విభేదించి, పార్టీ వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాను. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక నియోజకవర్గాలలో తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
ఇంతకాలం ఖమ్మం జిల్లాకే పరిమితమైన శ్రీనివాస్ రెడ్డి ఆదివారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావును ఆహ్వానించడం ఆసక్తి కలిగిస్తోంది. గతంలో ఒకసారి జూపల్లి, శ్రీనివాసరెడ్డి మధ్య భేటీ జరిగింది. అయితే వీరిద్దరూ ఒకే వేదికపై కలుసుకోవడం ఇదే మొదటిసారి.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు గత కొంతకాలంగా అధికార పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో భారీ అనుచర గణంతో ఆయన శ్రీనివాసరెడ్డి కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతుండడం చర్చనీయాంశమైంది