Arvind Kejriwal
అదానీ-మోదీ అంశంపై ప్రతిపక్షాల విమర్శలు రోజు రోజుకూ పదునెక్కుతున్నాయి. మోదీకి, అదానీకి ఉన్న సంబంధాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. తన స్నేహితుడిని కాపాడుకునేందుకు ప్రధాన మంత్రి ఇంతగా ఎందుకు కష్టపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
విధాత: ప్రధాని నరేంద్రమోదీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన కేజ్రీవాల్.. ఒకవేల హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై ఈడీ లేదా సీబీఐ దర్యాప్తు జరిపితే పోయేది మోదీయేకానీ.. అదానీ కాదని అన్నారు.
ప్రధాని మోదీ ఎవరికీ చేసింది ఏమీలేనట్టయితే తన స్నేహితుడి పట్ల ఆయనకు ఎందుకంత శ్రద్ధ? హిండెన్‌బర్గ్ రిపోర్ట్ పెను సంచలనం రేపింది. ఈ సమయంలో అదానీని కాపాడే ప్రయత్నాల్లో మోదీ తలమునకలై ఉన్నారు. ఇందులో రాజకీయ కోణం కూడా ఉన్నది’ అని కేజ్రీవాల్ విమర్శించారు. అందరికీ ముందు కనిపిస్తున్నది అదానీ అయితే.. ఆయన వెనుక ఉన్న అసలు ఇన్వెస్టర్ నరేంద్రమోదీయేనని ఆరోపించారు.
అదానీ గ్రూప్‌నకు 442 మిలియన్ డాలర్ల విలువైన పవన విద్యుత్ ప్రాజెక్టును అదానీకి అప్పగించేందుకు మోదీ శ్రీలంక ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారని ఆయన విమర్శించారు. నిజానికి ఆ ప్రాజెక్టు అదానీకి ఇవ్వలేదని మోదీయే పొందారని ఆరోపించారు. ఇదే విషయంలో శ్రీలంక పార్లమెంటులో రాజపక్సను అక్కడి సభ్యులు అడిగితే.. ఒత్తిడి కారణంగా ఆ ప్రాజెక్టు అదానీకి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారని ఆయన పేర్కొన్నారు.
దేశంలో కొన్ని ఎయిర్‌పోర్టులను రెండేళ్ల క్రితం ప్రైవేటుకు ఇచ్చినప్పుడు వేలం పాట నిబంధనలు కొన్ని ఆఖరి నిమిషంలో మార్చివేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ విధంగా ఆరు విమానాశ్రయాలు అదానీ గ్రూప్‌నకు దక్కాయని చెప్పారు. ఇవికూడా అదానీకి దక్కినవని అనుకోకూడదని, అవి దక్కింది మోదీకేనని ఆరోపించారు. ఎయిర్‌పోర్టుల బిజినెస్‌లో 30 శాతం మోదీదేనని అన్నారు