Adilabad | అతలాకుతలమైన జనజీవనం.. వేల ఎకరాల్లో పంట నష్టం
Adilabad తెగిన రహదారులు- నిలిచిపోయిన రాకపోకలు బిక్కు బిక్కుమంటూ పునరవాస కేంద్రంలో బాధితులు ఏనాడు లేని విధంగా భారీ వరద డేంజర్ జోన్ నుండి బయటపడ్డ కడెం ప్రాజెక్టు జూన్ లో వర్షాల కోసం ఎదురుచూపు జూలైలో సాధారణ వర్షపాతానికి మించిన వర్షాలు విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఏనాడు లేని విధంగా వారం రోజుల పాటు కురిసిన అత్యంత భారీ వర్షాలు అడవుల జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేశాయి. లొతట్టు ప్రంతాలు వరద […]

Adilabad
- తెగిన రహదారులు- నిలిచిపోయిన రాకపోకలు
- బిక్కు బిక్కుమంటూ పునరవాస కేంద్రంలో బాధితులు
- ఏనాడు లేని విధంగా భారీ వరద
- డేంజర్ జోన్ నుండి బయటపడ్డ కడెం ప్రాజెక్టు
- జూన్ లో వర్షాల కోసం ఎదురుచూపు
- జూలైలో సాధారణ వర్షపాతానికి మించిన వర్షాలు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఏనాడు లేని విధంగా వారం రోజుల పాటు కురిసిన అత్యంత భారీ వర్షాలు అడవుల జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేశాయి. లొతట్టు ప్రంతాలు వరద ముంపుకు గురయ్యాయి. వాగులు, వంకలన్నీ ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహించాయి. కడెం ప్రాజెక్ట్‌కు 4 లక్షలకు పైగా వరద ప్రవాహం రావడంతో డ్యామ్‌పై నుంచి వరద నీరు వెళ్లింది.
డ్యామ్ ప్రమాదపు టంచుకు వెళ్లి బయట పడింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం భయంగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. పలు గ్రామాలు, మండల కేంద్రాలకు మధ్య రోడ్లు వరద నీటికి ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
వాగులు, నదుల్లో వరద ఉధృతి పెరగడంతో బ్యాక్ వాటర్ వరద ఏ వైపు నుండి వస్తుందో అంటూ కొన్ని ప్రాంతాల ప్రజలు రాత్రిపూట నిద్రపోకుండా బిక్కు బిక్కు మంటూ గడిపారు. పలు చెరువులు తెగిపోవడంతో పంట పొలాలకు వరద నీరు చేరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పెనుగంగ, వార్ధ, ప్రాణహిత, కడెం నదులు ఉధృతంగా ప్రవహించాయి. వీటి బ్యాక్ వాటర్ ఫలితంగా సుమారు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది . కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కొమురం భీం ప్రాజెక్ట్ కి భారీగా వరద వచ్చింది.
పెద్దవాగు, దిందా తో పాటు పలు వాగులు ఉదృతంగా ప్రవహించి, లో లెవెల్ వంతెనల పై వెళ్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చెక్కి బాహ్య ప్రపంచానికి దూరమయ్యాయి . అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్లి వాగులో చిక్కుకొని ముగ్గురు చనిపోయారు. గ్రామీణ ప్రాంతాల రోడ్లు తెగిపోయి రవాణా సౌకర్యం నిలిచిపోయింది.
నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. ఇండ్లు చెరువులను తలపించాయి. గడ్డేన్న వాగు వరద బైంసా పట్టణాన్ని ముంచెత్తింది. ఆర్టీసీ డిపో పూర్తిగా మునిగింది. బస్సులు నీటమునిగాయి. సిబ్బంది వరద నీటిలో చిక్కుకొని సహాయం కోసం కోరారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం పడవపై వెళ్లి రక్షించారు.
కడెం ప్రాజెక్టు కు సామర్థ్యానికి మించి వరద రావడంతో, లోతట్టు గ్రామాలైన పాండవపూరు కన్నాపూర్ తదితర 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడెం వాగు నుంచి ఎస్సారెస్పీ నుంచి వస్తున్న వరదనీటితో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో 48 గేట్లు ఎత్తి 9 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
దీంతో మంచిర్యాల పట్టణంలోని రాంనగర్ ,ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ, బాలాజీ నగర్, ఆదిత్య ఎన్క్లేవ్స్ కాలనీ తదితర కాలనీలోకి వరద నీరు రావడంతో అధికారులు ఆ కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు . నస్పూర్ లోని జైపూర్ ప్రాంతాలలో గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించారు. వరద నీరు జైపూర్, చెన్నూర్ మండలాల్లోని వ్యవసాయ పొలాల్లోకి చేరడంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
ప్రతి ఏటా మంచిర్యాలలో పలు పలు కాలనీలు , కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ఎగువన ఉన్న చెన్నూరు ప్రాంతంలో వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా ప్రభుత్వం నయాపైస పరిహారం ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుండి తమ విలువైన సారవంతమైన భూములు ముంపుకు గురై పంటలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలు కాలనీల ఇళ్లలోకి వరద రావడంతో స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించడానికి వెళ్లగా బాధితులు నిలదీశారు. గత సంవత్సరం ఇలాగే జరిగిందని పరిహారం ఇప్పించలేదని , ప్రతి సంవత్సరం ఇలా అయితే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఇళ్లలో వరదనీటితో కూరుకుపోయిన బురదను తొలగించుకోవడానికి పునరావాస కేంద్రాల నుంచి తమ ఇండ్లకు వెళుతున్నారు. ఇండ్లలో చేరిన బురదను తొలగించుకోవడానికి కనీసం రెండు రోజులైనా పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.