భూమ్యాకర్షణ శక్తిని దాటిన ఆదిత్య-ఎల్‌1

  • Publish Date - October 1, 2023 / 01:15 AM IST
  • భూమి నుంచి 9.2లక్షల కిలోమీటర్లకు పయనం
  • అక్కడి నుంచి ఎల్‌ 1 పాయింట్‌ దిశగా..


బెంగళూరు: భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా పంపిన ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్‌.. భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరానికి వెళ్లిందని, భూమి ప్రభావం నుంచి బయటపడిందని ఇస్రో శనివారం ప్రకటించింది. ప్రస్తుతం ఇది సూర్యుడు-భూమి లాగ్‌రేంజ్‌ పాయింట్‌ 1 (ఎల్‌1) దిశగా పయనిస్తున్నదని తెలిపింది. భూమ్యాకర్షణ శక్తికి అవతలకు ఒక స్పేస్‌ క్రాఫ్ట్‌ను పంపడంలో ఇస్రోకు ఇది రెండో విజయం. మొదటిది మార్స్‌ ఆర్బిటార్‌ మిషన్‌ అని ఇస్రో తెలిపింది.



ఆదిత్య ఎల్‌1 మిషన్ స్పేస్‌క్రాఫ్ట్‌.. భూమి చుట్టూ ఉన్న డాటాను సేకరించే పని ప్రారంభించిందని, దీని ద్వారా భూమి చుట్టూ ఉన్న అణువుల ప్రవర్తనను విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలకు అవకాశం దొరుకుతుందని గత నెలలో ఇస్రో పేర్కొన్నది.

ఎల్‌ 1 చుట్టూ ఉన్న డాటాను సేకరించడం వల్ల అంతరిక్ష వాతావరణ గుణాత్మకతలు, సౌరగాలుల దృగ్విషయాలు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్‌-3 విజయవంతం అనంతరం సెప్టెంబర్‌ 2న ఆదిత్య ఎల్‌-1ను పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్‌ ద్వారా ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే.



సూర్యుని గురించి అధ్యయనం చేసేందుకు ఏడు రకాల విభిన్న పేలోడ్‌లను ఆదిత్య ఎల్‌ 1 తీసుకెళ్లింది. అందులో నాలుగు పేలోడ్‌లు సూర్యుడి కాంతి గురించి అధ్యయనం చేస్తాయి. మిగిలిన మూడు పాస్లామా, అయస్కాంత క్షేత్రాలను యథాతథ స్థితిలో లెక్కించేందుకు ఉద్దేశించారు.



ఎల్‌ 1 పాయింట్‌.. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకున్నాక సాపేక్షంగా సూర్యని చుట్టూ తిరుగుతుంది. తద్వారా నిత్యం సూర్యుడిపై దృష్టి కేంద్రీకరించే అవకాశం కలుగుతుంది.