Dil Raju: పవన్ కల్యాణ్ ఆలోచనలతో ఏకీభవిస్తున్నా : దిల్ రాజు

Reported by: Y.V. Narsimha Reddy | latest | May 27, 2025, 6:50 pm IST
Read Time: 4 mins
Dil Raju: పవన్ కల్యాణ్ ఆలోచనలతో ఏకీభవిస్తున్నా : దిల్ రాజు

Dil Raju: : సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని నిర్మాత, టీజీఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న వారి అభిప్రాయం అభినందనీయమన్నారు. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు సినిమాలు త్వరగా వెళ్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపుకు మొగ్గు చూపుతున్నారని దిల్ రాజు గుర్తు చేశారు. ఒక సినిమా ఎంతకాలానికి ఓటీటీకి వెళ్లాలి అనే అంశంపై మనమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందన్నారు.

ప్రేక్షకుడికి వెండితెరపై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత అని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలనే సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుందన్నారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ దిశగా ముఖ్యమైన తొలి అడుగులు వేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ.. అని మనమంతా కలిసికట్టుగా పైరసీపై పోరాడినప్పుడే, మన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలగుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. మన తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలిసికట్టుగా తోడ్పడుతామని స్పష్టం చేశారు.