Akali Dal | మళ్లీ.. NDA గూటికి అకాలీదళ్?
Akali Dal వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీయేను వదిలిన అకాలీదళ్ రాజకీయ అవసరాలను గుర్తిస్తున్న బీజేపీ అందుకే పాత మిత్రులకు స్నేహ సంకేతాలు చండీగఢ్: మొన్నటిదాకా భాగస్వామ్య పక్షాలను చిన్నచూపు చూసిన బీజేపీ.. ఇప్పుడు ప్రతి చిన్న భాగస్వామినీ అపురూపంగా భావిస్తున్నది. ఒకవైపు కాంగ్రెస్ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్‌తో కలిసి ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మోదీ చరిష్మా తగ్గిపోయిందని కర్ణాటక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఈ నేపథ్యంలో ‘కలిసి ఉంటే కలదు సుఖం’ […]

Akali Dal
- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీయేను వదిలిన అకాలీదళ్
- రాజకీయ అవసరాలను గుర్తిస్తున్న బీజేపీ
- అందుకే పాత మిత్రులకు స్నేహ సంకేతాలు
చండీగఢ్: మొన్నటిదాకా భాగస్వామ్య పక్షాలను చిన్నచూపు చూసిన బీజేపీ.. ఇప్పుడు ప్రతి చిన్న భాగస్వామినీ అపురూపంగా భావిస్తున్నది. ఒకవైపు కాంగ్రెస్ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్‌తో కలిసి ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. మోదీ చరిష్మా తగ్గిపోయిందని కర్ణాటక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.
ఈ నేపథ్యంలో ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే సూక్తిని బీజేపీ నమ్ముకుంటున్నదని అర్థమవుతున్నది. మూడోసారి అధికారంలోకి రావాలంటే సహకారం తప్పనిసరని భావించిన నేతలు.. పాత దోస్తులను దగ్గరకు తీసుకుంటున్నారన్న చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో పంజాబ్‌లో తనకు దూరమైన అకాలీదళ్‌కు దోస్తీ సంకేతాలు పంపినట్టు తెలుస్తున్నది. అకాలీదళ్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
గతంలో రైతు ఆందోళనల సందర్భంగా బీజేపీ వైఖరిని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి అకాలీదళ్ తప్పుకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నప్పటికీ.. దాని ప్రభావం పంజాబ్ ఎన్నికల్లో గట్టిగా కనిపించింది. రెండు దశాబ్దాల మిత్రపక్షాన్ని బీజేపీ దూరం చేసుకోవడంతో ఆప్ అధికారంలోకి వచ్చింది. ఈ పరిణామంతో పంజాబ్‌లో ప్రాంతీయ భాగస్వామి అవసరాన్ని బీజేపీ గుర్తించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అందుకే ఇటీవలి కాలంలో పాత మిత్రులకు సానుకూల సంకేతాలు పంపుతున్నదని చెబుతున్నారు. గత నెల 25న చండీగఢ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. అకాలీదళ్ సహా పాత ఎన్డీఏ మిత్రులందరినీ తాము గౌరవిస్తామని చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. నల్ల వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి మరీ అకాలీదళ్ ఎన్డీయేకు దూరమైనా.. ఆ పార్టీ ఎందుకు తమను వదిలి వెళ్లిపోయిందో తనకు తెలియదన్న రాజ్‌నాథ్.. వారు దూరమైనా.. తమ హృదయానికి అతి దగ్గరగా ఉంటారని వ్యాఖ్యానించారు.
అంతకు ముందు మే 5న ప్రకాశ్‌సింగ్ బాదల్‌కు నివాళులర్పించేందుకు హోం మంత్రి అమిత్‌షా కూడా వచ్చారు. ఏప్రిల్‌లో బాదల్ చనిపోయినప్పుడు ఏకంగా మోదీ వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్నా.. అకాలీదళ్ ఎన్డీయేలోకి మళ్లీ వచ్చే అవకాశాలపై రెండు పార్టీల నాయకూల నోరు మెదపలేదు. ‘ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఎన్నికలు వచ్చినప్పుడే కదా నిర్ణయాలు తీసుకునేది..’ అని అకాలీదళ్ అధికార ప్రతినిధి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిల్జీత్ చీమా చెప్పారు.
అయితే.. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి, పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వినీ శర్మ మాత్రం కూటమి అనేది తమ ప్రాధాన్యం కాదని అన్నారు. పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీ, అకాలీదళ్ చెరో రెండు స్థానాలు గెలిచాయి. ఒక స్థానాన్ని ఆప్ చేజిక్కించుకున్నది. కాంగ్రెస్‌కు 40.6 శాతం ఓట్లు లభించగా.. అకాలీదళ్ 27.8%, బీజేపీ 9.7%, ఆప్ 7.5 శాతం ఓట్లు సాధించాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ, అకాలీ ఆశలను గల్లంతు చేసింది.