Amar | రైతాంగ ఉద్యమం కోసమే సమాలోచనలు: అమర్
అందుకే కూర రాజన్నతో ఉత్తర భారత రైతు నేతలతో భేటీ జనశక్తి మాజీ కార్యదర్శి అమర్ వెల్లడి Amar | విధాత : రైతాంగం ఉద్యమంపై మార్గదర్శకం కోసమే దేశవ్యాప్తంగా జరిగిన కిసాన్ ఆందోళనలో చురుగ్గా పాల్గొన్న బీహార్ కిసాన్ సమితి (బీకేఎస్), భూమిహీన్ కిసాన్ సంఘర్ష్ సమితి(బీకేఎస్‌ఎస్), బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నేతలు ముగ్గురు ఆగస్టు 24, 2023న జనశక్తి నేత కూర రాజన్నను కలిసి పరామర్శించి, చర్చించడానికే వచ్చారని దీనిపై అనవసర అపోహలు […]

- అందుకే కూర రాజన్నతో ఉత్తర భారత రైతు నేతలతో భేటీ
- జనశక్తి మాజీ కార్యదర్శి అమర్ వెల్లడి
Amar | విధాత : రైతాంగం ఉద్యమంపై మార్గదర్శకం కోసమే దేశవ్యాప్తంగా జరిగిన కిసాన్ ఆందోళనలో చురుగ్గా పాల్గొన్న బీహార్ కిసాన్ సమితి (బీకేఎస్), భూమిహీన్ కిసాన్ సంఘర్ష్ సమితి(బీకేఎస్‌ఎస్), బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నేతలు ముగ్గురు ఆగస్టు 24, 2023న జనశక్తి నేత కూర రాజన్నను కలిసి పరామర్శించి, చర్చించడానికే వచ్చారని దీనిపై అనవసర అపోహలు ఎవరికి అవసరం లేదని జనశక్తి మాజీ కార్యదర్శి అమర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పది నెలల జైలు జీవితం గడిపి 2023 ఏప్రిల్ నెలలోనే విడుదలైన జనశక్తి నాయకులు కామ్రేడ్ కూర రాజన్నను కలువడానికి, ఆయన ఆరోగ్య స్థితిని వాకబు చేసి పరామర్శించడానికి దేశం నలుమూలలా ఉన్న పూర్వ సహచరులు అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా రాజన్నమాడ్గులపల్లి మండలం కుక్కడంలోని మిత్రుడి తోటలో ఉండగా, నన్ను (అమర్) కూడా ఆహ్వానిస్తే వెళ్లానని తెలిపారు. భారత రైతాంగం ప్రత్యేకించి ఉత్తర భారత రైతులు ప్రాణాలొడ్డి సాగించిన ఆందోళనతో దిగివచ్చిన భారత ప్రధానమంత్రి రైతులకు క్షమాపణలు చెప్పి ఒప్పుకున్న డిమాండ్లు నేటికీ అమలు జరగక పోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగంలో ఆందోళన వాతావరణం నెలకొందన్నారు.
పరస్పర పరామర్శల తర్వాత కిసాన్ ఆందోళన దశా దిశా గురించి కొన్ని సలహాలను వారు రాజన్నను అడిగారన్నారు. అంతేగాని ఈ సమాలోచనల్లో తెలంగాణ ఎన్నికలపైగాని, ఆయా ఎన్నికల పార్టీలపై, లేదా వ్యక్తులపైగాని ఎలాంటి చర్చ జరుగలేదన్నారు. ఇదే విషయం శుక్రవారం మధ్యాహ్నం పోలీసుల నిఘా మధ్య కూడా తోటలో మమ్మల్ని కలవడానికి వచ్చిన మీడియా ప్రతినిధులకు కూడా స్పష్టం చేయడం జరిగిందన్నారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరుగుతున్న ఈ సమాలోచనల గురించి తెలుసుకుని అనుమానాలతో వచ్చిన పోలీసులు సుదీర్ఘ పరిశీలన, విచారణల అనంతరం ఇదే విషయం నిర్ధారించుకుని సొంత పూచీకత్తుపై ఆగస్టు, 25, 2023 సాయంత్రం కల్లా మాకు స్వేచ్ఛ కల్పించారన్నారు.
ఈ సందర్భంగా మాకు స్వేచ్ఛ కల్పించుటకు సహకరించిన న్యాయవాదులు, హక్కుల సంఘాలు, పలు విప్లవ సంస్థలు, ప్రజా సంఘాలు, పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఎన్నికలతో గాని, ఎన్నికలతో ముడిబడ్డ పార్టీలకు గాని, వ్యక్తులకు గాని ఈ సమాలోచనలకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నట్లుగా అమర్ తెలిపారు.