పెగాసస్ కోడ్‌ను వాట్సాప్‌కు ఇవ్వండి: అమెరికా కోర్టు ఆదేశం
నిఘా సాఫ్ట్‌వేర్‌లను తయారు చేసే ప్రముఖ ఇజ్రాయెలీ సంస్థ, పెగాసస్ రూపకర్త ఎన్‌ఎస్‌వోకు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది

ఇజ్రాయెలీ సంస్థ ఎన్‌ఎస్‌వోకు అమెరికా కోర్టు ఆదేశం
తమ యాప్ ద్వారా పెగాసస్‌ను చొప్పించారన్న వాట్సాప్
2019లో ఏప్రిల్, మే నెలల్లో దాడులు జరిగాయని ఆరోపణ
అప్పటి వివరాలను సమర్పించేలా ఆదేశించాలని పిటిషన్
న్యూఢిల్లీ: నిఘా సాఫ్ట్‌వేర్‌లను తయారు చేసే ప్రముఖ ఇజ్రాయెలీ సంస్థ, పెగాసస్ రూపకర్త ఎన్‌ఎస్‌వోకు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించిన అన్ని అంశాలను, కోడ్‌తోసహా వాట్సాప్ కంపెనీకి అందించాలని కాలిఫోర్నియాలోని అమెరికా ఫెడరల్ కోర్టు.. పెగాసస్‌ను తయారు చేసిన ఇజ్రాయెలీ సంస్థ ఎన్‌ఎస్‌వోను ఆదేశించింది. పెగాసస్‌ను కొన్ని ప్రభుత్వాలు ఎంపిక చేసిన మొబైల్ ఫోన్‌లలో చొప్పిస్తున్నాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశంలో కూడా బీజేపీ ప్రభుత్వం కూడా రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, వివిధ మీడియా రంగాలకు చెందిన, ప్రత్యేకించి మోదీ విధానాలను నిలదీసే పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లలో దీనిని చొప్పించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరి నుంచి సమాచారం దొంగిలించాలనుకుంటున్నారో.. వారి మొబైల్ ఫోన్‌లలో ఈ సాఫ్ట్‌వేర్‌ను వారికి తెలియకుండానే చొప్పించి, వారి కదలికలన్నీ గమనించడం, వారి సంభాషణలు రికార్డు చేయడం దీని పని. తమ యూజర్లపై నిఘా కోసం 1400 డివైస్‌లలోకి వాట్సాప్ వ్యవస్థల ద్వారా ఎన్‌ఎస్‌వో ఇతర కంపెనీలు పెగాసస్ స్పైవేర్‌ను పంపించాయని ఆరోపిస్తూ 2019లో వాట్సాప్ లా సూట్ ఫైల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. దాడులు జరిగాయని చెబుతున్న తేదీకి ఏడాదికి ముందు, ఏడాది తర్వాతి కాలానికి సంబంధించి స్పైవేర్ సంబంధిత అన్నింటినీ అందజేయాలని ఎన్‌ఎస్‌వోకు స్పష్టం చేసింది. సంబంధిత అన్ని అంశాలు అంటే.. ఎన్‌ఎస్‌వో తయారు చేసిన పెగాసస్, ఇతర స్పైవేర్ ఉత్పత్తులని గారియన్ పత్రిక పేర్కొన్నది. ఈ దాడులు 2019 ఏప్రిల్, మే నెలల మధ్య జరిగాయని ఆరోపించిన వాట్సాప్.. 2028 ఏప్రిల్ నుంచి 2020 మే వరకు సంబంధిత మొత్తం మెటీరియల్‌ను అందించేలా ఎన్‌ఎస్‌వోను ఆదేశించాలని కోరింది. అయితే.. ఎన్‌ఎస్‌వో తన క్లయింట్లు, లేదా దాని సర్వర్ నిర్మాణతీరు గురించిన సమాచారం అందించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీన వెలువడిన ఈ తీర్పు.. చట్ట వ్యతిరేక దాడుల నుంచి తమ యూజర్లను రక్షించుకునే దీర్ఘకాలిక లక్ష్యంలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా వాట్సాప్ సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా తాము పట్టుబడవచ్చని, చట్టాన్ని ఉల్లంఘించలేమని స్పైవేర్ కంపెనీలు, హానికారకంగా ప్రవర్తించేవారు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. పెగాసస్ స్పైవేర్‌ను ఏదైనా ఫోన్‌లో చొప్పిస్తే.. ఆ ఫోన్‌లోని సమాచారం, అది చేసే పనులు, ఆఖరుకు ఆ ఫోన్ మైక్రోఫోన్, కెమెరాను కూడా యాక్సెస్ చేస్తుంది. అయితే.. పెగాసస్ అనేది ఉగ్రవాదులు, నేరస్తులను పట్టుకునేందుకు ఉద్దేశించినదని, చట్ట వ్యతిరేక నిఘాకోసం ఉద్దేశించింది కాదని ఎన్‌ఎస్‌వో సంస్థ చెబుతున్నది. తన కస్టమర్ల పేర్లు వెల్లడించేందుకు ఎన్‌ఎస్‌వో నిరాకరించినా.. ఈ సాఫ్ట్‌వేర్‌ను తాము ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని పేర్కొంటున్నది. ఇండియాలో లేదా విదేశాల్లో ప్రైవేటు సంస్థలు ఈ స్పైవేర్‌ను చొప్పించే అవకాశాలు లేవని దాని ప్రకారం తేలిపోతున్నది. అయితే.. భారత ప్రభుత్వం మాత్రం పెగాసస్‌ను వాడుతున్నట్టుగానీ, వాడటం లేదని కానీ చెప్పడం లేదు. 2021లో సుప్రీంకోర్టులో జరిగిన వాదన సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. స్పైవేర్‌ను వాడుతున్నామా? లేదా? అనే విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పలేదని అన్నారు. ఆ విషయం చెబితే.. ఉగ్రవాదులు అప్రమత్తమవుతారని, దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెగాసస్ వాడకంపై స్పష్టమైన ఖండన లేనందున ఈ అంశంపై దర్యాప్తు జరిపేందుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయడం తప్ప మరో మార్గం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే.. కమిటీ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గత ఏడాది ఆగస్ట్‌లో వ్యాఖ్యానించారు.
ఇండియాలో వైర్ సంస్థకు చెందిన సిద్ధార్థ వరదరాజన్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టుకు చెందిన ఆనంద్ మాంగ్నాలే ఫోన్‌లలో గుర్తు తెలియని ప్రభుత్వ సంస్థలు పెగాసస్‌ను ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయని గత ఏడాది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించడం సంచలనం రేపింది.