Chhattisgarh Encounter: చత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్..20మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దండకారణ్యం పరిధిలో మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. సుక్మా జిల్లా కేర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొగుండా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్ట్‌లు మృతిచెందారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Chhattisgarh Encounter: చత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్..20మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh Encounter:  ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దండకారణ్యం పరిధిలో మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. సుక్మా జిల్లా కేర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొగుండా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్ట్‌లు మృతిచెందారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. శనివారం ఉదయం గొగుండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పరస్పరం ఎదురుపడిన మావోయిస్ట్‌ల, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు పేర్కొన్నారు. కాగా ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత జగదీష్ కూడా ఉన్నట్లుగా వెల్లడించారు. బీరామ్ ఊచకోతలో జగదీష్ కీలక నిందిడని ఇతనిపై రూ.25లక్షల రివార్డు ఉందని తెలిపారు. 2023లో దంతేవాడ పేలుడులో జగదీష్ సూత్రధారిగా ఉన్నాడని పేర్కొన్నారు. దంతేవాడ పేలుడు ఘటనలో 10 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతి చెందారని గుర్తు చేశారు.

సంఘటనా స్థలం నుంచి 20 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ మీడియాకు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఏకే-47 రైఫిల్స్ తోపాటు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), ఇన్సాస్, రాకెట్ లాంచర్, బరెల్ గ్రనేడ్ లాంచర్ (బీజీఎల్)లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

మూడు నెలల్లోనే 130మందికి పైగానే హతం
ఈ ఏడాది చత్తీస్ గఢ్ లో మూడు నెలల్లోనే వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 130 మందికిపైగా మావోయిస్ట్‌లు మృతిచెందారు. ఒక్క బస్తర్ ప్రాంతం (బిజపుర సహా ఏడు జిల్లాలు)లోనే 116 మంది చనిపోయారు. గతవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజం నిర్మూలించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా భద్రత బలగాలు దూసుకెలుతున్నాయి.

మావోయిస్టుల ఐఈడీకి ఇద్దరు చిన్నారుల బలి
భద్రత బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బీజాపూర్ పోలీసుల కథనం మేరకు అటవీ ప్రాంతంలోకి వెళ్లే మార్గంలో మావోయిస్టులు గతంలో ఐఈడీ అమర్చారు. అడవిలో పండ్లు ఏరుకునేందుకు తన పిల్లలతో కలిసి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి వస్తుండగా.. అనుకోకుండా దానిపై కాలు వేయడంతో ఒక్కసారిగా అది పేలిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఆమెను దగ్గర లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.