AP Elections
విధాత: జగన్ సర్కారు ప్రత్యర్ధి సిద్దం కాక ముందే యుద్ధం ముగించాలన్న ఆలోచనలో ఉంది. యుద్ధం గెలువాలంటే ప్రత్యర్ధి బలహీనతలనే తమ ఆయుధంగా మలుచుకొని దాడి చేయాలన్న సూత్రాన్ని జగన్ అమలు చేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు సిద్దం కాక ముందే ఎన్నికల ప్రక్రియ ముగించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంతో పాటు గానే ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్లడానికి జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది.
అయితే ఏపీలో ప్రస్తుతం జగన్‌కు ఎదురు గాలి వీస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. దీనికి తోడు జగన్ చిన్నాన,మాజీ ఎంపీ వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసు విచారణలో ఉంది. ఈ హత్య కేసులో సీబీఐ విచారణ జరుగుతున్న తీరు జగన్ ప్రభుత్వానికి కలంకం తెచ్చేలా ఉంది. ఈ కేసులో ఇరుక్కుంటారన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నది.
ఏపీలో ఒక్కో వర్గం జగన్‌కు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఉద్యోగులు జగన్ సర్కారుకు దూరం అవుతున్నారు. మరో వైపు పార్టీలో అసంతృప్త నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఇప్పటికే వైసీపీ నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేక పాటి చంద్రశేఖర్‌రెడ్డిలు బయటకు వెళ్లారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి కూడ పార్టీకి దూరం అయ్యారు.
కాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి జగన్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏకంగా జిల్లా ఇంచార్జీ పదవికి రాజీనామా చేశారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు క్రాస్ చేసిందనే నెపంతో తాడి కొండ ఎమ్మెల్ల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెన్స్ చేశారు. ఇలా జగన్ వెంట నడిచిన నేతలు ఒక్కోక్కరుగా దూరం అవుతున్నారు.
ఇలా పార్టీకి దూరం అవుతున్న వారి సంఖ్య ఇంకా చాలా ఉందన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతున్నది. ఒక వైపు జగన్ సర్కారుకు ప్రజల్లో వ్యతిరేక పెరుగుతున్నది, మరో వైపు పార్టీలో అసంతృప్తులు పెరుగుతుండడం, కొంత మంది ముఖ్యమైన నాయకులు పార్టీకి దూరం కావడం అనేది జగన్‌ను ఆలోచనలో పడేసింది. ఇంకో వైపు ప్రతిపక్షాలు దూకుడు పెంచాయి.
ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అగ్రనేత చంద్రబాబు నాయుడు ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’ పేరుతో పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు జనం బాగా వస్తున్నారు. మరో వైపు యువగళం పేరుతో నారాలోకేష్ రాష్ట్ర మంతా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర సక్సెస్‌పుల్‌గా సాగుతున్నది.
ప్రతిపక్ష నేత ప్రజల్లో తిరుగుతుండగానే.. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో సినీనటుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ బయలు దేరాడు. ఇప్పటికే పలు సార్లు చంద్రబాబుతో చర్చలు జరిపాడు.. మరోవైపు పవన్ బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నాడు. ఏపీలో జగన్‌కు వ్యతిరేకంగా విశాల కూటమిని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఇక్కడి నేతలు పని చేస్తున్నారు.
కమ్యూనిస్టులు కూడ రాష్ట్రంలో జగన్‌కు వ్యతిరేకంగానే ఉన్నారు. పనిలో పనిగా చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య జాతీయ మీడియాకు చెందిన ఒక చానల్ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో మోడీని పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే ప్రస్తుతం ప్రధాని మోడీతో జగన్ సఖ్యతగా ఉన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నేతలంతా ఒక కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వీరంతా ఐక్యం కావడానికి ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తోంది. వీరంతా ఐక్యం అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఒకే వైపు పడే అవకాశం ఉంటుంది.
ఇదే జరిగితే ఏపీలో జగన్ ఓటమి ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విపక్షాలు ఐక్యం కాకముందే.. కూటమి ఏర్పాటు ప్రయత్నాలు బలపడక ముందే ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న దిశగా ఏపీ సీఎం జగన్ అత్యంత సన్నిహితులతో కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.