విధాత: ఒరేయ్ ఎద్దు ఈనిందట చూడరా అంటే.. అయ్యగారూ దూడను కట్టేశాను అన్నాడట బుర్ర తక్కువ పాలేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య నిప్పు రాజేసిన విశాఖ ఉక్కు పరిస్థితి అలాగే ఉంది. విశాఖ ఉక్కును అమ్మెస్తున్నాం.. అంటూ కేంద్రం రెండేళ్లుగా చెబుతూ వస్తోంది. ఐతే దాన్ని మేం సింగరేణి తరఫున తీసుకుంటాం, ఉద్ధరిస్తాం అని కేసీఆర్ ఊదరగొట్టి కొందరు అధికారులను సైతం ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించి రావాలని పంపారు.
ఇది అయినా మరునాడే కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గాన్ సింగ్ కులస్తే విశాఖ వచ్చి.. మేం సంస్థను అమ్మడం లేదు.. ఇంకా బలోపేతం చేస్తాం అన్నారు.. దీంతో ఈ ఘనత తమదే అంటూ తెలంగాణ నాయకులూ కేటీఆర్, హరీష్ రావు వంటి వాళ్ళు మీడియాలోకి వచ్చేశారు.
కేసీఆర్ దెబ్బ.. కేంద్రం అబ్బా.. మేం అడుగు పెట్టాం.. కేంద్రం భయపడి పోయింది ఇక దానికి మేమే పెద్ద దిక్కు అంటూ టీవీల్లో మాట్లాడేశారు.. ఎహె అసలు పాయింట్ అది కాదు మేం రెండేళ్ల కిందటే కేంద్రాన్ని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలని కోరాం అందుకే ఆగింది అంటూ పాత ఫోటోను విడుదల చేస్తూ జనసేన సైతం తమ డప్పు తాను కొట్టేసుకుంది.
అలా కాదమ్మా మేం కూడా కేంద్రాన్ని కోరాం.. అమ్మొద్దని అడిగాం.. అందుకే ఆగింది అంటూ వైఎస్సార్సీపీ మంత్రులు గుడివాడ అమర్ వంటి వాళ్ళు కూడా మీడియాలోకి వచ్చేశారు.. ఇదిలా ఉండగానే సాయంత్రానికి కేంద్ర మంత్రి మళ్ళీ మాట మార్చి.. ఎహె నేను ఆలా అనలేదు.. దానికి సంబంధించిన అమ్మకం ప్రక్రియ నడుస్తూనే ఉంది.. మనమంతా కలిసి దాన్ని ఆపాలి అంటూ ఏదేదో అన్నారు.
ఈ లోపు ఉక్కు మంత్రిత్వ శాఖ కూడా ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసే విషయంలో ఎలాంటి మొహమాటాలు లేవు అంటూ ఓ ప్రకటన ఇచ్చింది.. అంటే అలూ లేదు చూలూ లేదు.. ఏదో తోక పట్టుకుని మేం చేశాం.. మా ఘనత అని చెప్పుకున్న నాయకులందరూ ఇప్పుడు చిన్నబోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక చివరిగా బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు సైతం లైన్లోకి వచ్చి.. తెలంగాణను అప్పుల పాల్జేసింది కేసీఆర్ కుటుంబం.. దేశాన్ని కాపాడుతున్నది మేం… స్టీల్ ప్లాంట్ సంగతి మేం చూసుకుంటాం.. అంటూ తన పాత్ర తాను పోషించారు. అందరూ కలిసి ఏదోలా చేసి మా పరిశ్రమను కాపాడండి అంటూ ఉక్కు పరిశ్రమ కార్మికులు చేతులు జోడిస్తున్నారు.