Amazon
విధాత: ఇటీవల ప్రతి అంశాన్ని షోషల్ మీడియాలో పంచుకోవడం చాలా మందికి సాధారణంగా మారింది. తద్వారా కొన్ని అంశాల్లో చెడు జరుగుతుండగా, మరికొన్ని అంశాల్లో నెటిజన్లకు మేలు కూడా జరుగుతున్నది. ఇటీవల ఒక మహిళ అమెజాన్‌లో ఆపిల్ వాచ్ ఆర్డరివ్వగా, ఆమెకు డెలివరీలో ఫేక్ వాచ్ వచ్చింది.
తప్పుడు డెలివరీ అందిందని, వస్తువు మార్చాలని, లేదా డబ్బులు వాపస్ అయినా ఇవ్వాలని బాధితురాలు అమెజాన్ హెల్ప్‌లైన్‌కు అనేకసార్లు ఫోన్లు చేసింది. అయినా, సరైన సమాధానం రాకపోవడంతో విషయాన్ని అన్ని ఆధారాలతో ట్విట్టర్‌లో పోస్టుచేసింది. ఆ పోస్టు వైరల్‌గా మారడంతో దెబ్బకు అమెజాన్ సంస్థ దిగివచ్చింది. ఆర్డర్ వివరాలు పంపించండి.. అని విజ్ఞప్తి చేసింది.
అసలు ఏమి జరిగిందంటే..
సనయ అనే మహిళ రూ.50,900 విలువైన యాపిల్ వాచ్ సిరీస్-8కు అమెజాన్‌లో ఈ నెల 8వ తేదీన ఆర్డర్ పెట్టారు. తొమ్మిదో తేదీన ఆర్డర్ డెలివరీ అయింది. ప్యాకింగ్‌ను విప్పిచూడగా, ఫేక్ వాచ్ కనిపించింది. వెంటనే ఆమె అమెజాన్ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి విషయం వెల్లడించింది. డబ్బులు తిరిగి ఇవ్వడానికి, వాచ్‌ను వాపస్ తీసుకోవడానికి, మార్పిడికి అమెజాన్ అంగీకరించలేదని బాధితురాలు తెలిపింది.
NEVER ORDER FROM AMAZON!!! I ordered an @Apple watch series 8 from @amazon on 8th July. However, on 9th I received a fake ‘FitLife’ watch. Despite several calls, @AmazonHelp refuses to budge. Refer to the pictures for more details. Get this resolved ASAP.@AppleSupport pic.twitter.com/2h9FtMh3N2
— Sanaya (@Sarcaswari) July 11, 2023
అమెజాన్ నుంచి ఎప్పుడూ ఆర్డర్ చేయవద్దు!
“నేను జూలై 8న amazon లో Apple వాచ్ సిరీస్ 8ని ఆర్డర్ చేస్తే 9వ తేదీన నాకు నకిలీ ‘ఫిట్‌లైఫ్’ వాచ్ వచ్చింది. అనేక కాల్స్ చేసినప్పటికీ, Amazon Help డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. మరిన్ని వివరాల కోసం చిత్రాలను చూడండి. సమస్యను పరిష్కరించండి” అని బాధితురాలు ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దాంతో ఆమెజాన్ దిగివచ్చింది.
స్పందించిన అమెజాన్..
ఈ ట్వీట్‌పై అమెజాన్ హెల్ప్ ట్విట్టర్ ఖాతా స్పందించింది. వినియోగదారురాలు అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ఆర్డర్ వివరాలను డీఎం ద్వారా పంపాలని వారు ఆమెను కోరారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. @నాకు ఇలాంటి తరహా అనుభవమే ఎదురైంది* అని ఒకరు పేర్కొన్నారు. @గాడ్జెట్స్, విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి నేను ఎప్పుడూ ఆన్‌లైన్ పోర్టల్‌ను విశ్వసించను* అని మరో నెటిజన్ తెలిపారు.