విధాత: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం (Delhi Liquor Case) కేసులో ఈనెల 16వ తేదీ ఆదివారం విచారణకు రావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ ) శుక్రవారం సమన్లు పంపించింది. ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడి, కొంత మందికే లబ్ది చేకూరేలా చేశారన్న ఆరోపణలపై విచారణలో భాగంగా కేజ్రీవాల్ ను విచారణకు రావాలని సీబీఐ కోరింది.
ఇప్పటికే మద్యం పాలసీ కుంబకోణం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మరో మంత్రి సత్యేందర్ జైన్ జైలులో ఉన్నారు. ఇదే కేసులో తెలంగాణ సీఎం కెసిఆర్ కుమార్తె, బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలుసార్లు ఈడీ విచారణకు వెళ్లారు.
తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారణకు రావాలని సీబీఐ సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ నాయకులపై కక్ష పూరితంగా విచారణ సంస్థల చేత దాడులు చేయిస్తుందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. గురువారం నాడు ఢిల్లీలో విపక్ష నేతలు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కేజ్రీవాల్‌ను కలిసిన మరుసటి రోజునే కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీస్‌లు ఇవ్వడం గమనార్హం.
27న విచారణకు రండి.. ఢిల్లీ సీఎంకు గోవా పోలీస్‌ల నోటీస్‌లు
గోవా పోలీసులు ఢిల్లీ సీఎం అరవిద్ కేజ్రీవాల్‌కు నోటీస్‌లు ఇచ్చారు. ఈనెల 27 వ తేదీన పెర్నేమ్ పోలీస్టేషన్‌కు ఉదయం 11 గంటల వరకు హాజరు కావాలని సీఆర్‌పీసీ నోటీస్‌లు ఇచ్చారు. ఆస్థుల ధ్వంసం కేసులో గోవా శాఖ అమిత్ పాలేకర్ కు నిన్న నోటీసులు ఇచ్చి విచారించారు.ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ కు గోవా పోలీసులు నోటీస్‌లు జారీ చేశారు