ASI survey Gyanvapi
విధాత: భారీ భద్రత నడుమ కాశీ జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సర్వే ప్రారంభమైంది. కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న ఈ మసీదును ఏదైనా గుడిని కూల్చికట్టారా లేదా అనే అంశాన్ని ఈ సర్వే తేల్చనుంది. వారణాసి జిల్లా కోర్టు ఈ సర్వేకు అనుమతివ్వగా దీనిని నిలుపుదల చేయాలని మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఉదయమే సర్వే మొదలవగా..ఉత్తర్‌ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్ కూడా ఈ రోజే విచారణకు రానుంది.
హిందూ మహిళలకు మసీదులో పూజ చేసుకునేందుకు అనుమతి ఇస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఏడు గంటలకు సర్వే ప్రారంభంకాగా పోలీసులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో మోహరించారు. హిందువులు శివలింగం అని భావిస్తున్న వాజూఖానా అనే ప్రాంతం వద్ద తప్ప మిగిలిన మసీదులో ఈ సర్వే కొనసాగుతుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఏఎస్ఐ తన సర్వే నివేదికను ఆగస్టు 4కల్లా అందించాల్సి ఉంటుంది. ఈ సర్వే జరుగుతున్న రోజు హిందువులకు చరిత్రాత్మకమైన రోజని ఈ కేసులో పిటిషన్‌దారైన సోహన్ లాల్ ఆర్య అభిప్రాయపడ్డారు.