విధాత: పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురైన నేపథ్యంలో అనర్హత వేటుకు గురైన రాహుల్‌గాంధీకి (Rahul Gandhi) అయోధ్యలోని ఒక ప్రముఖ ఆలయం పూజారి నుంచి అరుదైన ఆహ్వానం అందింది. రాహుల్‌గాంధీ ఎంపీగా నివసించిన బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు తమ ఇళ్లను ఆఫర్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో అయోధ్యలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన హనుమాన్ గడి ఆలయం (Hanumangarhi temple) పూజారి మహంత్ సంజయ్‌దాస్.. రాహుల్‌గాంధీ తమ ఆలయం ప్రాంగణంలోని ఆశ్రమంలో నివసించవచ్చని చెప్పారు. పదో శతాబ్దం నాటిదైన హనుమాన్‌గడి ఆలయం ప్రధాన పూజారి మహంత్‌జ్ఞాన్‌దాస్ కుమారుడు, ఆయన అర్చకత్వానికి వారసుడు సంజయ్ దాస్. అయోధ్యలోని సాధువులు అంతా రాహుల్‌గాంధీ ఈ పవిత్ర నగరానికి రావాలని కోరుకుంటున్నారని, ఇక్కడ నివసించాలని ఆకాంక్షిస్తున్నారని సంజయ్ దాస్ చెప్పారు.
‘రాహుల్ తప్పకుండా అయోధ్య రావాలి. హనుమాన్ గడి ఆలయాన్ని సందర్శించి, పూజలు నిర్వహించాలి. హనుమాన్ గడి ఆలయ ప్రాంగణంలో అనేక ఆశ్రమాలు ఉన్నాయి. ఆయన ఇక్కడకు వచ్చి నివసిస్తే మా అందరికీ సంతోషం’ అని సంజయ్‌దాస్ చెప్పారు. 2016లో ఈ ఆలయాన్ని రాహుల్‌గాంధీ సందర్శించారు. మహంత్ జ్ఞాన్‌దాస్ ఆశీస్సులు పొందారు.
ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా యూపీలో నడకను రాహుల్‌గాంధీ ఘజియాబాద్‌లోని లోని నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్య రామజన్మభూమి ఆలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ ఆశీస్సులు రాహుల్‌కు అందాయి. రాహుల్‌ను ఉద్దేశించి ఒక లేఖ రాసిన సత్యేంద్రదాస్.. ఆయన చేపట్టిన యాత్ర విజయవంతం కావాలని ఆశీర్వదించారు. ఈ యాత్ర దేశ విశాల ప్రయోజనాలను కాంక్షించి చేస్తున్నదని పేర్కొంటూ.. ‘సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ’ అని దీవించారు.